2025కు న్యూఢిల్లీలో శ్రీకారం

2025కు న్యూఢిల్లీలో శ్రీకారం
- రైల్వే ఆధునీకరణలో భారత్ ముందంజలో – మంత్రి అశ్విని వైష్ణవ్**
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(Confederation of Indian Industry) (సీ.ఐ.ఐ) నిర్వహిస్తున్న16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన (IREE–2025).., అంతర్జాతీయ రైల్వే సదస్సు (IRC–2025)ను కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు.
ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ప్రదర్శన..
ఈ IREE–2025 ప్రదర్శన ఆసియాలోనే అతిపెద్దది కాగా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే, రవాణా ప్రదర్శనగా గుర్తించబడింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, వాటాదారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. రైల్వేలు కేవలం రవాణా వ్యవస్థ కాదు.. అవి దేశ అభివృద్ధికి ప్రాణాధారం అని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
మోదీ నేతృత్వంలో రైల్వేల్లో విప్లవాత్మక మార్పులు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్వే ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఈ కాలంలో దాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు నిర్మించబడ్డాయి. అలాగే 46,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు విద్యుదీకరించబడ్డాయి అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలు 156, వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)లు 30, అమృత్ భారత్‌లు 4 నమో భారత్ సర్వీసులు నడుపుతున్నాయని, ఇవి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 7,000 కోచ్‌లు తయారు అవుతుండటంతో ఉత్పత్తి స్థాయిలు గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు.
భారత రైల్వే టెక్నాలజీకి అంతర్జాతీయ వేదిక..
రైల్వే టెక్నాలజీ, తయారీ, ఆవిష్కరణలలో భారతదేశం సాధించిన పురోగతిని ప్రదర్శించడానికి IREE–2025 ఒక ప్రధాన వేదిక అని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీ.ఐ.ఐ, గతి శక్తి విశ్వవిద్యాలయం మధ్య ఎంఓయూ (MoU)పై సంతకం చేయడం జరిగింది. ఈ అవగాహన ఒప్పందం పరిశ్రమ, విద్యా సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.
మూడు రోజుల ప్రదర్శన, 14 దేశాల పాల్గొనిక..
ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో పరిశ్రమ చర్చలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, వ్యాపార సమావేశాలు, సాంకేతిక ప్రదర్శనలు జరుగనున్నాయి. IREE–2025లో ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ తదితర 14కు పైగా దేశాల నుండి 20,000కు పైగా పరిశ్రమ నిపుణులు, 450కు పైగా ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు.
భవిష్యత్తు రైల్వే, ఆవిష్కరణ, ఏకీకరణ, భాగస్వామ్యం..
భవిష్యత్తుకు సిద్ధమైన రైల్వే: ఆవిష్కరణ, ఏకీకృతం, ప్రపంచ భాగస్వామ్యాలు అనే అంశంపై IRC–2025లో చర్చలు జరుగనున్నాయి.
సదస్సు సుమారు 500 మంది అంతర్జాతీయ ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది కొనుగోలుదారు, విక్రేతలు, పరిశ్రమ–ప్రభుత్వం మధ్య పరస్పర చర్చలకు, కొత్త భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలకు దోహదపడనుంది.
భారత రైల్వే భవిష్యత్తు దిశగా మరో అడుగు..
IREE–2025తో భారత్ తన రైల్వే రంగంలో ఉన్న ఆవిష్కరణ సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, ప్రపంచ అనుసంధాన శక్తిని మరోసారి నిరూపిస్తోంది.

