మక్తల్ లో దారుణం…

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సత్యవార్ గ్రామంలో భర్త కృష్ణారెడ్డి (32) తన భార్య వినోద (28)ను అనుమానం కారణంగా దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది.
ఈనెల 3న జరిగిన ఈ ఘటనపై మృతురాలి తల్లి సబ్బు తిప్పమ్మ ఫిర్యాదు మేరకు మక్తల్ ఎస్సై వై.భాగ్యలక్ష్మి రెడ్డి కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాలపై, డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో సీఐ రామ్‌లాల్ దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం—
పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాదుకు చెందిన కృష్ణారెడ్డి పదేళ్ల క్రితం వినోదను వివాహం చేసుకున్నాడు. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి అనంతరం కొంతకాలం బాగానే ఉన్నా… తర్వాత ఉద్యోగం కోల్పోయి మద్యానికి బానిసై భార్యను తరచుగా వేధించేవాడు. అనుమానం పెంచుకొని పలుమార్లు చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో పరిస్థితి తట్టుకోలేక వినోద తల్లిదండ్రుల వద్ద సత్యవార్ గ్రామంలో నివసిస్తూ కూలీ పనులు చేసేది.
కృష్ణారెడ్డి నెలకు 10–15 రోజుకోసారి భార్య, కొడుకు వద్దకు వచ్చి వెళ్లేవాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు, కొన్నిసార్లు వినోద ఫోన్ బిజీ రావడంతో అతనికి అనుమానం పెరుగింది. ఆ అనుమానాల వల్ల ఆమెను కలిసే ప్రతి సారికి గొడవ పెట్టుకుని.. తరచుగా వేధించేవాడు. చివరకు ఆ అనుమానాలు, కారణంగా విసుగు పుట్టి ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని, రెండు-మూడు సార్లు హత్యాయత్నాలకు పన్నాగం పన్ని విఫలమయ్యాడు.
ఇదిలా ఉండగా, గత నెల 27న దసరా పండుగకు గ్రామానికి వచ్చిన కృష్ణారెడ్డి, ముందే కొనుక్కొన్న కత్తిని ఉపయోగించి అక్టోబర్ 3న పొలం వద్ద నుంచి తిరిగి వస్తూ వినోదపై దాడి చేశాడు. కడుపులో, చేతుల్లో పలు సార్లు పొడిచి, చివరికి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం స్కూటీపై అక్కడి నుండి పారిపోయాడు.
పోలీసులు నమ్మదగిన సమాచారం ఆధారంగా మహబూబ్‌నగర్ భూత్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిందితుడిని పట్టుకుని, హత్యకు ఉపయోగించిన కత్తి, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
కేసు దర్యాప్తులో బాగా పనిచేసిన మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై వై.భాగ్యలక్ష్మి రెడ్డి, మాగనూరు ఎస్సై అశోక్ బాబు, క్రైమ్ స్టాప్ అశోక్, నరేష్, శ్రీకాంత్, శశిధర్ గౌడ్, శ్రీహరి గౌడ్ లను డీఎస్పీ అభినందించారు. వీరికి త్వరలో ఎస్పీ చేతుల మీదుగా రివార్డు ఇవ్వడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.
