ఉమ్మడి జిల్లాలో సత్తా చాటాలి…..

  • జిల్లా ఎమ్మెల్యేలతో ఇంచార్జ్ మంత్రి రాజనర్సింహా సమీక్ష…..

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పార్టీ కోసం శ్రమించిన వారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా ఇన్ చార్జీ మంత్రి దామోదర రాజ నరసింహా అన్నారు. శనివారం హైదరాబాద్ లోని తన స్వగృహంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి తో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి రాజ నరసింహ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా కి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిర్వహించిన మంత్రులు, ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం.. అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నాయకులు.. కార్యకర్తలకి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేస్తే అన్ని స్థానాలలో మన అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు ఉంటాయని మంత్రి చెప్పారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పార్టీ కోసం ఆయా ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వారికి టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. అవసరమైతే పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేసే ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు మరింతగా వివరించాలన్నారు. ఎన్నికల ప్రచారాలు వ్యూహాత్మకంగా చేయాలని, అన్ని జిల్లాలోనూ పార్టీ విజయకేతనం చేయాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, శ్రీహరితో పాటు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాసరెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మెఘా రెడ్డి, రాజేష్ రెడ్డి, పరిణిక రెడ్డి, వీర్లపల్లి శంకర్ ఉన్నారు.

Leave a Reply