మక్తల్, ఆంధ్రప్రభ : కరీ పండుగ విందు భోజనం జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి భార్య వినోద (28)ను అత్యంత దారుణంగా హత్య చేసి పరారైన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సత్యవరం గ్రామంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో ఉంటున్న కృష్ణారెడ్డి…. పండుగ కోసం అత్తారింటికి కుటుంబంతో సహా వచ్చాడు. శుక్రవారం పొలం వద్దకు వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులంతా కలిసి విందు ఆరగించారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వెనకాల వస్తున్న సమయంలో, దారి మధ్యలో భార్యను కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం నిందితుడు కృష్ణారెడ్డి అక్కడి నుండి పరారయ్యాడు. తర్వాత ఎంతసేపైనా.. కూతురు అల్లుడు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా, రక్తపు మడుగులో కూతురు పడి ఉండడం గుర్తించి… మక్తల్ పోలీసులకు తెలియజేశారు.
పోస్ట్‌మార్టం నిమిత్తం శవాన్ని పోలీసులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై. భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.

