పత్తికొండలో లారీ బీభత్సం
- జనంపై దూసుకెళ్లి..
- ఆటోను ఢీకొన్న లారీ
- ఇద్దరు మహిళలు..
- ఓ చిన్నారి దుర్మరణం
- పత్తికొండలో దుర్ఘటన
తుగ్గలి (కర్నూలు జిల్లా) ఆంధ్రప్రభ : రెండు రోజుల్లో దసరా పండుగ(Dussehra festival). పండక్కి పిల్లా జెల్లా ఇంటిల్లి పాదికి కొత్త బట్టలు కొని, పిండి వంటలకు అవసరమైన సరుకుల కోసం వచ్చిన ఇద్దరు ఇల్లాళ్లను మృత్యు రూపంలో బియ్యం లారీ(rice lorry) చంపేసింది. మరో అర గంటలో ఇంటికి వెళ్లిపోతామని ఆటోలో కూర్చున్నఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు(Kurnool) జిల్లా పత్తికొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం బియ్యం లారీ ఆటోను ఢీ(auto collision) కొనడంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతి చెందారు.
తుగ్గలి మండలం ముక్కెళ్ల(Mukkella) గ్రామానికి చెందిన సుమన్ భార్య భూమిక (36), కుమార్తె నిఖిత(Nikhitha) (3), పవన్ భార్య శిరీష(35) లు పండగ సరుకుల కోసం ముక్కెళ్ల నుండి పత్తికొండ(Pathikonda)కు వెళ్లి అక్కడ బట్టలు, పండుగ సరుకులు తీసుకుని ముక్కెళ్లకు వెళ్లేందుకు ఆటోలో కూర్చున్నారు. ఇంతలో బియ్యం లారీ వెనక నుంచి ఆటోను ఢీకొనడంతో ఆటోలో కూర్చున్నముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగి పోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
