లండన్ – అంతర్జాతీయ వేదికపై (international ) రష్యాకు (russia ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దం క్రితం మలేసియా ఎయిర్‌లైన్స్‌కు (malesia air lines ) చెందిన ఎంహెచ్17 విమానాన్ని కూల్చివేసింది రష్యానే అని యూరప్ అగ్రశ్రేణి మానవ హక్కుల న్యాయస్థానం (ECHR) సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, 2022 నుంచి ఉక్రెయిన్‌లో (ukrain ) రష్యా పాల్పడుతున్న హత్యలు, అత్యాచారాలు, మౌలిక సదుపాయాల ధ్వంసం వంటి అఘాయిత్యాలకు కూడా మాస్కోనే బాధ్యురాలని స్పష్టం చేసింది.
2014 జూలై 17న ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తున్న మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం తూర్పు ఉక్రెయిన్‌లో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మాస్కో అనుకూల వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న ప్రాంతం నుంచి రష్యా నిర్మిత బక్ క్షిపణితో ఈ దాడి జరిగిందని కోర్టు తేల్చింది. “బహుశా దానిని సైనిక విమానంగా పొరబడి ఉద్దేశపూర్వకంగానే క్షిపణిని ప్రయోగించి ఉంటారు” అని కోర్టు అధ్యక్షుడు మథియాస్ గైమర్ తీర్పు చదువుతూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సరైన విచారణ జరపకుండా, బాధ్యతను నిరాకరిస్తూ రష్యా వ్యవహరించిన తీరు బాధితుల కుటుంబాల బాధను మరింత పెంచిందని కోర్టు పేర్కొంది.
ఇదే సమయంలో, ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. వేలాది మంది పౌరుల మరణానికి కారణమవడమే కాకుండా, ఉక్రెయిన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు అత్యాచారాన్ని ఒక యుద్ధ ఆయుధంగా వాడుకుందని ఆక్షేపించింది.
ఈ తీర్పుపై రష్యా తీవ్రంగా స్పందించింది. కోర్టు తీర్పును తాము పాటించబోమని, దానికి ఎలాంటి విలువ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కొట్టిపారేశారు. మరోవైపు, ఉక్రెయిన్ ఈ తీర్పును “చారిత్రక, అపూర్వ విజయం”గా అభివర్ణించింది. నష్టపరిహారంపై కోర్టు తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటుంది.