IND vs ENG | గిల్ సెంచ‌రీ.. భారత్ పైచేయి !

ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సరికి 310/5 స్కోరుతో దృఢంగా నిలిచింది. ఓపెనర్ జైస్వాల్ అర్ధ సెంచరీ సాధించాడు. ఇక‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకంతో ఆకట్టుకోగా, రవీంద్ర జడేజా అతనికి మంచి మద్దతుగా నిలిచాడు. చివరి సెషన్‌లో ఈ జోడీ అజేయంగా 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి భారత్‌ను మంచి స్థితిలోకి చేర్చింది.

మ్యాచ్ సాగిందిలా…

టాస్ గెలిచిన ఇంగ్లాండ్, తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, జైస్వాల్ జాగ్రత్తగా ఆరంభించారు. అయితే రాహుల్ పూర్తిగా స్థిరపడలేకపోయాడు. క్రిస్ వోక్స్ తన అద్భుతమైన లెంగ్త్‌తో క్లీన్‌బౌల్డ్ చేయ‌డంతో రాహుల్ 2 పరుగులకే వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ – కరుణ్ నాయర్ రెండవ వికెట్‌కు 80 పరుగులు జోడించి వేగంగా ఆడారు. కరుణ్ మంచి టచ్‌లో కనిపించినా, లంచ్‌కు ముందు బ్రైడన్ కార్స్ వేసిన బౌన్సర్‌కి బలయ్యాడు.

జైస్వాల్ క్లాస్ ఇన్నింగ్స్…

లంచ్ తర్వాత జైస్వాల్ తన ఆటలో మరింత స్థిరత్వం చూపిస్తూ 11వ టెస్ట్ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌పై నాలుగో అర్ధశతకం కావడం విశేషం. కెప్టెన్ గిల్ తో కలిపి మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. అయితే బెన్ స్టోక్స్ వేసిన బంతికి జైస్వాల్ (87) వికెట్ ఇచ్చేయడంతో ఇంగ్లాండ్‌కు ఊపొచ్చింది. ఆ తర్వాత రిషబ్ పంత్ (25), నితీష్ రెడ్డి (1) నిరాశ ప‌రిచారు. దీంతో భారత్ 211/ ఐదు వికెట్లు కోల్పోయింది.

శతక్కొట్టిన గిల్ !

అయితే, కెప్టెన్ శుభ్‌మాన్ తన శైలిని మార్చుకుని మరింత గంభీరంగా ఆడుతూ… క్రీజులోకి పాతుకుపోయాడు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను శక్తివంతంగా ఎదుర్కొంటూ తన 7వ టెస్ట్ సెంచరీని సాధించాడు. రవీంద్ర జడేజా అతనికి చక్కటి భాగస్వామిగా నిలిచాడు. ఈ జోడీ 99 పరుగుల అజేయ భాగస్వామ్యంతో స్కోరు బోర్డును పటిష్టంగా నిలిపింది.

దీంతో స్టంప్స్ సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 90 ఓవర్లలో 310 ప‌రుగులు సాధించింది. ప్ర‌స్తుతం క్రీజులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్: 114* (216 బంతులు) , రవీంద్ర జడేజా: 41* (67 బంతులు) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయ‌గా.. స్టోక్స్, బషీర్, కార్స్ తలా ఒక్కొక్క వికెట్ ప‌డ‌గొట్టారు.

శుభ‌మ‌న్ గిల్ – ర‌వీంద్ర జడేజా ఇదే ఊపుతో రేప‌టి ఆట‌ని కొన‌సాగిస్తే… ఇన్నింగ్స్‌ను 400కు దాటి తీసుకెళ్లే అవకాశముంది. అయితే, ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా బౌలింగ్ చేసి, ఏ సమయంలోనైనా మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశం ఉంది. రెండో రోజు ప్రారంభ సెషన్ ఈ టెస్ట్‌ను ఏ దిశగా నడుపుతుందో నిర్ణయించనుంది.

Leave a Reply