TG | బీసీ, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విస్తృత ప్ర‌చారం.. సీఎల్పీ నిర్ణయం

హైద‌రాబాద్ – బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే, ఎస్సీ కులాల వ‌ర్గీక‌ర‌ణ అంశాల‌ను గ్రామ స్థాయిలో విస్తృత ప్ర‌చారం చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింది.. చారిత్రాత్మ‌కంగా బీసీ కులాల గ‌ణ‌న చేపట్టిన విష‌యాన్ని అన్నివర్గాల ప్ర‌జ‌ల‌కు చేరాల‌ని సూచించింది.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష‌త‌న ఇవాళ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎల్పీ సమావేశం జ‌రిగింది.. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలు, నిర్ణయాలతో పాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు.. అలాగే బీసీ, ఎస్సీ వర్గీకరణపై రెండు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించింది. ఈ సభలకు రాహుల్ గాంధీ, ఖర్గేను ఆహ్వానించాలని సీఎల్పీ తీర్మానించింది. ఇక కులగ‌ణ‌న స‌ర్వే పై విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ధీటుగా స్పందించాల‌ని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల‌కు సూచించారు. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల నోటిఫికేషన్ రానుంద‌ని కూడా ప్ర‌స్తావించారు.. గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌నిచేయాల‌ని కోరారు.

ఆ 10మంది ఎమ్మెల్యేలు దూరం …
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన‌ సీఎల్పీ సమావేశానికి పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటం, శాసనసభ కార్యదర్శి నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో వివాదాన్ని మరింత జఠిలం చేసుకోకుండా సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం మంచిది కాదనే అభిప్రాయంతోనే దూరంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *