Kavita Letter | లేఖ‌లు రాయ‌డం స‌హ‌జం – కెటిఆర్

హైద‌రాబాద్ – సోద‌రి కవిత రాసిన లేఖపై కేటీఆర్ శనివారం స్పందిస్తూ, కొన్ని అంతర్గత విషయాలను పార్టీలో అంతర్గతంగానే చర్చించాలని హితవు పలికారు. పార్టీలో తనతో సహా అందరూ కార్యకర్తలేనని, ఈ నియమం అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో దయ్యాలు ఉన్నారని కవిత చేసిన ఆరోపణలపై ఏమంటారని మీడియా ప్ర‌తినిధులు అడగగా.. ప్రస్తుతం తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన ఆ శనిని, ఆ దయ్యాన్ని వదిలించడంపైనే తాము, తమ పార్టీ దృష్టి సారించిందని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రతీ పార్టీలోనూ కోవర్టులు ఉంటారని, సమయం వచ్చినప్పుడు వారు ఎవరనేది బయటపడుతుందని వివరించారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అని కేటీఆర్ చెప్పారు.

పార్టీలో ఏ కార్యకర్త అయినా తన అభిప్రాయాలను, సూచనలను అధ్యక్షుడికి తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ అభిప్రాయ వెల్లడి అనేది మౌఖికంగా, లేఖల ద్వారా, ఫోన్ ద్వారా, నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా.. ఇలా వివిధ పద్ధతులలో జరుగుతుంటుందని వివరించారు. అయితే, కొన్ని విషయాలను అంతర్గతంగా చర్చించాల్సి ఉంటుందని, వాటిని అంతర్గతంగానే చర్చించాలని కేటీఆర్ చెప్పారు. కాగా, ప్రెస్ మీట్ పూర్తయ్యేవరకూ కేటీఆర్ తన సోదరి కవిత పేరెత్తకపోవడం గమనార్హం.

Leave a Reply