KRMB | ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీ కీలక నిర్ణయం !

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి దృష్ట్యా పెరుగుతున్న తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాలను విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టులలో నీటిమట్టాల పరిమితిని కూడా కేఆర్ఎంబీ స్పష్టంచేసింది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

ఏపీ అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా, శ్రీశైలం జలాశయంలో నీటి మట్టాన్ని జూలై చివరి వరకు కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని కేఆర్ఎంబీ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.

ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

Leave a Reply