న్యూ ఢిల్లీ – పాకిస్థాన్ ఉగ్రవాద సంబంధాలను ప్రపంచ దేశాల ముందు ఉంచేందుకు భారత్ తన దౌత్య కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏడు భారత ప్రతినిధి బృందాల్లో రెండు బృందాలు తమతమ నిర్దేశిత దేశాలకు ఈరోజు బయలుదేరాయి. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం తొలుత ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, హేమాంగ్ జోషి, ప్రదాన్ బారువా, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ ఉన్నారు.
శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో బృందం యూఏఈ, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్, లైబీరియా దేశాలకు బయలు దేరింది.
“పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. గత 40 ఏళ్లుగా దీని ప్రభావం మాపై పడుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరిని ప్రస్తుతం ప్రపంచవేదికలపై ఎండగట్టబోతున్నాం” అని సంజయ్ ఝా ప్రయాణానికి ముందు తెలిపారు. 140 కోట్ల భారతీయుల భద్రత విషయంలో తామంతా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
పహల్గామ్‌లో 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్” కింద పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వాదనలను తిప్పికొట్టి, వాస్తవాలను ప్రపంచానికి వివరించేందుకు ఈ దౌత్య యాత్ర చేపట్టారు. మొత్తం ఏడు బృందాలను ఏర్పాటు చేయగా , వాటిలో రెండు బృందాలు తమకు కేటాయించిన దేశాలకు బయలుదేరాయి.