హైదరాబాద్ అంబర్‌పేట్ ఫ్లై ఓవర్‌ను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పనులను ఆయన నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొంటారని చెప్పారు.
కొంత మంది ఫ్లై ఓవర్‌ను ఆపే పని చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇంటి స్థలం సేకరించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అడ్డుపడే ప్రయత్నం చేసిందన్నారు. ఇంకా 6 చోట్ల భూ సేకరణ పూర్తి కాలేదని.. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే అంబర్‌పేట్ ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన జరిగినట్లుగా గుర్తుచేశారు. గ్రేవీ యార్డ్ కారణంగా రోడ్డు విస్తరణ చేయలేక.. ఫ్లై ఓవర్ నిర్మాణం మంజూరు చేయించినట్లు తెలిపారు. ఫ్లై ఓవర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నాలుగు లేన్ల ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. వరంగల్ హైవే నుంచి సిటీలోకి వచ్చే వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. కాగా ఇదే సమయంలో లింగపల్లి లోని బిహెచ్ ఈ ఎల్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ను కూడా గట్కరీ సోమవారం నాడు ప్రారంభించనున్నారు..
2018లో శంకుస్థాపన జరిగినా…
ఇక అంబర్ పేట్ ఫ్లై ఓవర్ స్థల సేకరణ కోసం 300 కోట్లు ఖర్చు అవ్వగా.. మొత్తం నిర్మాణ ఖర్చు 450 కోట్లు వరకు వచ్చింది. ఇది గోల్నాక దగ్గర ప్రారంభమై ఎంసిహెచ్ క్వార్టర్స్ సమీపంలోని పూర్ణోదయ కాలనీలో ముగుస్తుంది. ఈ అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌కు 2018లో అడుగులు పడ్డాయి. అయితే, పనులు 2021లో ప్రారంభమయ్యాయి. 2023లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, నిర్ణీత సమయానికి నిర్మాణం పూర్తవ్వలేదు. ఇప్పటికి పూర్తి కావడంతో కేంద్ర మంత్రి గట్కరి నగర ప్రజలకు అంకితమివ్వనున్నారు.