భూమిపై అవతరించిన, పాపులను ద్వేషించకు…పాపాలను ద్వేషించూ…అన్న ప్రేమమూర్తి, దైవ కుమారుడు ఏసుక్రీస్తుకు కల్వరిగిరిపై శిలువ చేసిన దినమే శుభ శుక్రవారం. క్రీస్తు సువార్తల ప్రకారం క్రీ.శ.33లో చంద్ర గ్రహణం రోజున అని భావిస్తారు. క్రీస్తు మరణ తాలూకు జ్ఞాపకాలను క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే దినమిది. ఈస్టర్‌కు ముందు వచ్చే శుక్రవారంను క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. దీనినే హూలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని అంటారు. ప్రపంచానికి శాంతి దూతగా అందించిన యేసు క్రీస్తును 2000 ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం కల్వగిరి గిరిపై శిలువ వేశారు… మానవాళి పాప ప్రక్షాళన కోసం ప్రాణాలను అర్పించిన ఏసు ప్రభువు త్యాగానికి గుర్తుగా క్రైస్తవులు చర్చిలలో శిలువను ఉంచి ప్రార్థిస్తారు. ప్రపంచంలో మానవాళి అత్యధికంగా నమ్మేది క్రైస్తవ మతం అని చెప్పడంలో సందేహం లేదు. క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు శుభ శుక్రవారం రోజున ప్రాయశ్చిత్తం ప్రార్థనలు, ఉపవాసాలు జరుపు కోవడం ఆచారం. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించే వారిని క్రైస్తవులు అంటారు. పరిశుద్ధ గ్రంథము (హూలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంథము.
యూదుల మతము సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో (భారత దేశంలో వేద కాలం నడుస్తున్న కాలంలో) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, ద్వితియోపదేశ కాండము, సంఖ్యా కాండము వంటి పుస్తకాలు యూదులకు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. ఆ కాలంలో యూదులు పాప పరిహారార్థం బలులు అర్పించేవారు. కాలక్రమేణా యూదుల ఆచారాలలో ధనిక-పేద, యజమాని-బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూఢ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మ శాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సులభతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యోషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు జన్మించాడు. యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు దేశం అంతా రోమన్ల పరిపాలనలోకి వెళ్ళిపోయింది.
బాల్యం నుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్క బడినవారిని అక్కున చేర్చు కొన్నారు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకు రావడానికి ప్రయత్నించారు. రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభతరం చేసి క్రొత్త నిబంధనగా బోధించారు. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక బోధనలకు పలువురు యూదులు, మరికొన్ని కులాలవారు ప్రభావితులయ్యారు. రోమన్ సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందస్తులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాందస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమన్ సామ్రాజ్యపు చక్రవర్తికి అప్పగించారు. చక్రవర్తి జూడాల ఆరోపణలను అంగీకరించక పోయినా, ఆయన దేవుని ప్రతినిధిగా చెప్పు కుంటున్నారని, వివిధ ఆరోపణలను జోడించి ఒత్తిడి తెచ్చి, చక్రవర్తి మత ప్రవక్తకులకు వదిలి వేయగా, వారు ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా శిలువ వేశారు. తర్వాత శిలువ యాగం కారణంగా నిర్యాణం చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు, రోమన్స్ అంగీకరించారు. ఆనాటి నుండి క్రైస్తవ్యం అనే మార్గం ప్రపంచ మంతా విస్తరించసాగింది.
గుడ్ ఫ్రైడే అనేది బైబిల్‌లో ఎక్కడా ప్రస్తావించబడకున్నా, యేసు ప్రభువును శిలువ వేయడాన్ని ప్రస్తావించడం జరిగింది. దానికి గుర్తుగా గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి ఇళ్లలో గుడ్ ఫ్రైడేకు 40 రోజుల ముందు ప్రార్థనలు మరియు ఉపవాసం ప్రారంభమవుతాయి. గుడ్ ఫ్రైడే రోజున, ప్రజలు చర్చికి వెళ్లి ప్రభువైన యేసును స్మరిస్తారు. ఆయన ఇచ్చిన విద్యను కూడా గుర్తు చేసుకుంటారు. ఈస్టర్ ఆదివారం యేసు జీవించి ఉన్న ఆనందంలో, ప్రజలు ప్రభువు భోజనంలో పాల్గొని ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.
- రామకిష్టయ్య సంగనభట్ల