WGL | మోసగించడంలో రేవంత్ రెడ్డి నెంబర్ వన్.. ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు, ఏప్రిల్15(ఆంధ్రప్రభ) : ప్రజలను మోసగించడంలో దేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ వన్ గా నిలుస్తారని, పాలనలో మాత్రం చివరి స్థానంలో ఉంటాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల శివారులోని శ్రీనివాస గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చలేదన్నారు. రైతుబంధు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని, 420హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. బ్రోకర్ మాటలు మాట్లాడడం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి అలవాటేనన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఈ విధంగానే బ్రోకర్ మాటలు మాట్లాడితే మందలించానని గుర్తు చేశారు.

సీఎం అయినా ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే జరిగిన పనులు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు. నా హయాంలో రూ.100 కోట్లతో మంజూరు చేసిన నిధులు వేరే జిల్లాలకు మళ్ళించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, ఓడిపోతామనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేస్తుందన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు గెలుస్తామన్నారు. ఏ ఎన్నిక వచ్చినా గెలుపు బీఆర్ఎస్ పార్టీ దేనిని, గెలవకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. అనేక పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సాధించి అనేక రంగాల్లో రాష్ట్రాన్ని ముందు నిలిపిన కేసీఆర్ పాలన మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఈనెల 27న జరిగే రజతోత్సవ సభతో దేశ మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని, ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా 50వేలకు తగ్గకుండా తరలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, నాయకులు చామకూరి ఐలయ్య, నల్ల మాస ప్రమోద్, కుర్ర శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, అంకూస్, కాలు నాయక్, ఎన్నమనేని శ్రీనివాసరావు, కర్నే నాగరాజు, మెకానిక్ రాజు, బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *