పాకిస్తాన్ : భారీ బాంబు పేలుడు సంభవించిన ఘటన పాకిస్తాన్ లోని సౌత్‌వెస్ట్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజధాని క్వెట్టాకు దక్షిణంగా 40 కి.మీ దూరంలో ఉన్న మస్తుంగ్ జిల్లాలో పోలీసుల బస్సును లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు రిమోట్ సాయంతో ఐఈడీ బాంబును పేల్చారు. బ్లాస్ట్ జరిగిన సమయంలో బస్సులో 40మంది పోలీసు అధికారులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి తీవ్ర గాయలైనట్లుగా ఉన్నతాధికారి రాజా ముహమ్మద్ అక్రమ్ వెల్లడించారు.
అయితే, బలూచిస్తాన్ లో దశాబ్దాలుగా వేర్పాటువాద తిరుగుబాటుతో పాకిస్తాన్ పోరాడుతోంది. అక్కడున్న ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఖనిజ సంపదతో పాటు సౌత్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని భద్రతా దళాలు, విదేశీయులు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. కాగా, ఈ దాడికి ఏ గ్రూపు ఇప్పటి వరకు బాధ్యత వహించకపోవడం గమనార్హం.