ప్రజల ఆశయాలే మా పాలనకు దిక్సూచి: సీఎం చంద్రబాబు
కూటమి విజయం అధికారం కాదు.. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని ఆయన గుర్తుచేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 164 స్థానాలు గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఫలితాన్ని నమోదు చేసింది. అనంతరం చంద్రబాబు నాయుడు జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కూటమి విజయం తమకు కేవలం అధికారం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నామని వివరించారు. అసమానతలు లేని సమాజం నిర్మించడం, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నామని తెలిపారు. నాటి ప్రజా తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.
గత ఏడాది కూడా కూటమి విజయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. జూన్ 4ను ప్రజాస్వామ్య విజయం, ప్రజా తీర్పు దినంగా కూటమి నేతలు అభివర్ణించారు.
మొత్తంగా, జూన్ 4 తీర్పు కూటమికి రాజకీయ విజయమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యతను గుర్తుచేసే రోజని చంద్రబాబు పేర్కొన్నారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ “జై ఆంధ్రప్రదేశ్” అని సీఎం తన సందేశాన్ని ముగించారు.
