జనతాగంజ్ మార్కెట్ యార్డు సందర్శన..

వేములవాడ, ఆంధ్రప్రభ : వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం గురువారం స్టడీ టూర్‌లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని సిద్ధనూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న జనతాగంజ్ మార్కెట్ యార్డును సందర్శించింది.

ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో అమలు చేస్తున్న ఆధునిక సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలు, పంటల కొనుగోలు-అమ్మకాల విధానం, నిల్వ గోదాములు, తూకం వ్యవస్థ, పారదర్శక వేలం ప్రక్రియ, డిజిటల్ లావాదేవీల నిర్వహణ తదితర అంశాలను పాలకవర్గ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు.

జనతాగంజ్ మార్కెట్ యార్డు అధికారులు అక్కడ అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ చర్యలు, మార్కెట్ నిర్వహణ విధానాల గురించి సభ్యులకు వివరించారు. రైతులకు అనుకూలంగా చేపడుతున్న కార్యక్రమాలు, మార్కెట్ ఆదాయ వనరుల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై పరస్పర చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ, ఈ సందర్శన ద్వారా పొందిన అనుభవాలు, అవగాహనను వేములవాడ మార్కెట్ యార్డులో అమలు చేసి రైతులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయడం ద్వారా స్థానిక మార్కెట్ అభివృద్ధికి కొత్త ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించేందుకు ఈ స్టడీ టూర్ దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు కత్తి కనకయ్య, పాలకుర్తి పరశురాం, ఖమ్మం గణేష్, మానుపాటి పరుశురాములు, చెరుకు శంకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply