మానవులు సౌందర్యోపాసకులు. తమ రూపాన్ని, అందాన్ని ఇనుమడింప చేసుకోడానికి నిరంతరం తాపత్రయ పడుతూంటారు. రకరకాల సౌందర్య సాధనాలను, ఆభరణాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఇవన్నీ బాహ్య సౌందర్యాన్ని పెంపొందిస్తాయేమో గానీ, అంత: సౌందర్యాన్ని పెంచలేవు. శరీర సౌందర్యంకన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని తెలుసుకొన్న జ్ఞానులు వ్యక్తుల అంత: సౌందర్య పోషణకు అవసరమైన సౌందర్య సాధనాలేవో, ఆభరణాలు ఏవో చక్కగా విశ్లేషణాత్మకంగా వివరించారు.
భర్తృహరి కవి ఇలా అన్నారు : ”శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన, దానేన పాణి:, నతు కంకణ న / విభాతికాయ: కరుణా పరాణాం, పరోపకారేణ న చందనేన”. చెవులకు అందం వాటికి తగిలించిన కుండలాలు, జూకాలు, వజ్రాభరణాల వల్ల రాదు. నైతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విషయాలను వినడం ఒక్కటే సరైన కర్ణాభరణం. మరి చేతులకు రకరకాల బంగారు గాజులు, రంగురంగుల మట్టి గాజులు, కంకణాలు, కడియాలు, బ్రేస్లెట్ల వంటి నగల వల్ల అందం కలుగదు. అర్థులకు దానం ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే చేతులే అందమైన చేతులు. ”చేతులకు తొడవు దానము” అని కదా సుమతీ శతక ప్రబోధము.
శరీరానికి చందన చర్చ, గంధాను లేపనము, ఫేస్ పౌడర్లు, క్రీములు పూయడం వలన అందం కలుగదు. పరోపకారం చేయడమే శరీరానికి వన్నె తెస్తుంది.
సుగుణ సంపత్తి కలిగి ఉండడమే మనిషికి నిజమైన ఆభరణం. ”…..రూపానికి హృదయం ఆభరణం, హృదయానికి ఏనాటికీ తరగని సుగుణం ఆభరణం” అన్నారు ఒక సినీ కవి. అలాగే పెదవులకు లిప్ స్టిక్, తాంబూల సేవనం వంటివి కాదు చిరునవ్వును కలిగి ఉండడమే అలంకారం. శ్రీరాముడు స్మిత పూర్వ భాషి. స్నేహ పూర్వక చిరునవ్వుతో అందరినీ పలుకరించడం ఆయన వద్ద నుండి మనం నేర్చుకోవాలి. అన్నింటినీ మించిన శాశ్వతమైన ఆభరణం హిత, మిత, స్మితమైన సత్య వాక్కు. ”కేయూరాణి న భూష యంతి పురుషం హారా న కంఠోజ్వలా:/ నస్నానం, న విలేపనం, న కుసుమం, నాలంకతా మూర్ధజా:/ వాణ్యే కాచమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే / క్షీయంతే ఖలు భూ షణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ”(భర్తృహరి). భుజకీర్తులు, ముత్యాల రత్నాల హారాలు, పన్నీటి స్నానములు, చందన లేపనాలు, పుష్పాలం కరణలు, వివిధ రకాల కేశాలంకరణలు మానవులకు నిజమైన అలంకారాలు కావు. చక్కగా, సంస్కారవంతంగా, ఉన్న వాక్కు మాత్రమే వారికి అసలు సిసలైన అలంకారం అని భర్తృహరి భావం.
భగవంతుడు మనుషులకు రెండు చెవులు, ఒక్క నాలుక మాత్రమే ప్రసాదించినది అధికంగా వినడానికి, తక్కువ మాట్లాడడానికి మాత్రమే అన్నారు ప్రాచీన గ్రీక్ తత్త్వవేత్త డయోజెనీస్. కనుక మంచి ఆధ్యాత్మిక విషయాలను వింటూ, వాటిని శక్త్యానుసారము ఆచ రిస్తూ, దానధర్మాలు చేస్తూ, కరుణ కల్గి, పరోపకార బుద్ధి పెంపొందించుకొని, సద్గుణ శోభితులై, చిరునవ్వులు చిందిస్తూ, సందర్భోచితంగా చక్కగా మాట్లాడుతూ ఉండడమే అందమైన జీవితానికి నిజమైన చిహ్నం కదా !
- గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి