గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా

గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా
- ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఆంధ్రప్రభ : నిన్న రాత్రి నోస్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం బొంగోనిచెర్వు సమీపంలోని నోస్ ల్యాబ్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడగా, వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదం జరిగిన రెండో బ్లాక్‌ను సందర్శించిన అధికారులు, సంఘటనకు గల కారణాలు మరియు అమలులో ఉన్న భద్రతా చర్యలపై ప్లాంట్ ఇన్చార్జిని ప్రశ్నించారు. ఉద్యోగుల భద్రత, బీమా సదుపాయాలు, కంపెనీ అనుమతులపై కూడా వివరాలు సేకరించారు.
ఇదిలా ఉండగా, స్థానికులు ల్యాబ్ సామర్థ్యానికి మించి ఉత్పత్తి జరుగుతోందని, కొత్త భవనాలకు సరైన అనుమతులు లేవని ఆరోపించారు. పరిసర ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు సరైన భద్రతా చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కంపెనీ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీవో మేక అశోక్ రెడ్డి, చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
