బాల్య వివాహాలు, కౌమార గర్భాల నిరోధానికి ప్రచార రథం…

బాల్య వివాహాలు, కౌమార గర్భాల నిరోధానికి ప్రచార రథం…

– జిల్లాలో కళాజాతలతో అవగాహన

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో బాల్య వివాహాలు, కౌమార గర్భాల నివారణకు చర్యలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 27 మండలాల్లో కళాజాత ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం కర్నూలు, కల్లూరు, ఓర్వకల్ మండలాల పరిధిలోని పలు సచివాలయాల్లో ప్రచార రథం ఆధ్వర్యంలో కళాజాత బృందాలు పాటలు, నాటికలు, నినాదాల ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, కౌమార గర్భాల ప్రమాదాలపై ప్రజలకు వివరణ ఇచ్చాయి.

మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి. విజయ నేతృత్వంలో బృందాలు ముజఫర్ నగర్‌లోని 82వ సచివాలయం, కుమ్మరి స్ట్రీట్‌లోని 10, 11వ సచివాలయాలు, నన్నూరులోని 1వ సచివాలయాన్ని సందర్శించి ప్రజలను చైతన్యపరిచాయి. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్యపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించడంతో పాటు కౌమార దశలో గర్భధారణ వల్ల కలిగే ప్రమాదాలను స్పష్టంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కౌమార గర్భాల విషయంలో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉండటంతో ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు నివసించే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

మాటల కంటే పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం త్వరగా వ్యాప్తి చెందుతుందని భావించి కళాజాత రూపంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా Beti Bachao Beti Padhao కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో ఐసిడిఎస్ కర్నూలు ప్రాజెక్ట్ సీడీపీఓ అనురాధ, సూపర్వైజర్లు జరీనా, సుజాత, వరలక్ష్మి, డీసీపీఓ శారద, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మేరీ స్వర్ణలత, డీసీపీయూ సిబ్బంది లక్ష్మి, పీఎఫ్ఓ శ్రీనివాసులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply