కాళేశ్వరం దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ట్రస్ట్ బోర్డును నియమించింది. ఈ మేరకు తెలంగాణ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆలయ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో మొత్తం 11 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయబడింది. ఈ ట్రస్ట్ బోర్డు రెండు సంవత్సరాల కాలపరిమితి వరకు పదవిలో కొనసాగనుంది. గతంలో ట్రస్ట్ బోర్డుల పదవీకాలం ఒక సంవత్సరంగా ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం దానిని రెండేళ్లకు పెంచింది.

ఇదిలా ఉండగా, సరస్వతీ నది అంత్య పుష్కరాలు, రాబోయే గోదావరి పుష్కరాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. గోదావరి–ప్రాణహిత నదుల సంగమ ప్రాంతంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు.

నూతన ట్రస్ట్ బోర్డు ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల మెరుగుదల, ఉత్సవాల నిర్వహణ, దేవస్థానం ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా స్థానిక భక్తులు, గ్రామ ప్రజలు నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటును స్వాగతిస్తూ ఆలయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ట్రస్ట్ బోర్డు సభ్యులు:

చైర్మన్‌గా మోహన్ శర్మ నియమితులయ్యారు. డైరెక్టర్లుగా దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డురి శ్రీధర్ రావు, బీసుల నర్సయ్య, మంచినీళ్ల దుర్గయ్య, గందేసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, సీతారామ్, సత్తయ్య, దేవుడా శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఎక్స్-అఫీషియో సభ్యుడిగా ఫణీంద్ర శర్మ (నగేష్) నియమితులయ్యారు.

Leave a Reply