కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం…

కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం…
పుష్పార్చనలో అమ్మవారికి అపూర్వ అలంకారం..
వేదఘోషల మధ్య సుగంధ పుష్పాలతో మహార్చన
వసంత నవరాత్రుల్లో భక్తి ప్రవాహం…
రాబోయే శ్రీరామనవమి వేడుకలకు సిద్ధం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రుల సందర్భంగా ఏడవ రోజు పుష్పార్చన అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించబడింది. లోకపావని దుర్గమ్మ తల్లికి వివిధ సుగంధభరిత పుష్పాలతో చేసిన మహార్చన భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచింది. ఈ పుష్పార్చనలో తామర, గన్నేరు, మరువం, సన్నజాజులు, ఎర్ర మందారాలు తదితర పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించగా, ఆలయ ప్రాంగణం మొత్తం దివ్య సుగంధాలతో, వేద మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించింది.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు క్రమబద్ధంగా నిర్వహించారు. వసంత నవరాత్రుల సందర్భంగా రాబోయే రోజులలో మరిన్ని విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 26న చైత్ర శుద్ధ అష్టమి సందర్భంగా క్షేత్రపాలక ఆంజనేయ స్వామివారికి అభిషేకం, నాగవల్లీ దళార్చన జరగనుండగా, మార్చి 27న శ్రీరామనవమి రోజున కళావేదికలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

మార్చి 28న వసంత నవరాత్రుల పూర్ణాహుతి, ఉత్సవ సమాప్తి, అనంతరం శ్రీరాముల పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం ప్రత్యేక పుష్పార్చనలు కొనసాగుతుండగా, భక్తులు ఆర్జిత సేవల ద్వారా పాల్గొనేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ దివ్యోత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలను పొందాలని దేవస్థానం అధికారులు భక్తులను కోరారు.

