ఉమ్మడి మెదక్ బ్యూరో : విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పదవ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య హైస్కూల్, ఎస్ఆర్కే డిజి హై స్కూల్, పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
ఈసందర్భంగా ప్రశ్న పత్రాలు ఎన్ని గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా ? హాజరు శాతం, తదితర వివరాలను పరీక్షల నిర్వహణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, సెక్యూరిటీ, ఫర్నీచర్, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వేసవికాలం అయినందున పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో చల్లని త్రాగునీరు, ఫ్యాను, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన ఔషధాలు, మరుగుదొడ్లు, తదితర అన్ని సౌకర్యాలను సమకూర్చాలని, ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రామస్వామి ఉన్నారు.