సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి

సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి
విజయవాడ, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండనీ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జనసైనికులు ఏర్పాటు చేసిన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కేంద్రాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకుంటున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2026 వ సంవత్సరం జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసేవారిని ఉద్యమి, సాదక్, ప్రదాతలుగా వర్గీకరించినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పార్టీ తొలి సభ్యత్వం తీసుకొని రెండు కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం విరాళం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉద్యమి సభ్యత్వ నమోదు రుసుము 400 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ నెల 26వ తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణం లో జనసైనికులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా పార్టీలో చేరిన వారితో పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 75 నుండి 100 మంది సాధకులను నియమించామని పేర్కొన్నారు. ఉద్యమి సభ్యత్వం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు.
పక్కా ప్రణాళికతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
