Decades | మోదుగు చెట్టుకి హొలీ పువ్వు…

Decades | మోదుగు చెట్టుకి హొలీ పువ్వు…
మోత్కూర్ లో హొలీ, శ్రీ రామలింగేశ్వర కల్యాణ వేడుకలు
అనాదిగా ఆచారం… హొలీ రోజే శ్రీ రామలింగేశ్వర కల్యాణం
Decades | మోత్కూర్, ఆంధ్రప్రభ : విపరీతమైన మోదుగు చెట్లతో…మోదుగూరు గా పేరుగాంచి… కాలక్రమేణా మోత్కూర్ గా పేరొందిన గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్. ఇక్కడ ఓ ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. హొలీ వేడుకల రోజే …స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణ వేడుకలు జరుగడం అనాదిగా ఆచారం. ముందు రోజు కామదహనం తర్వాత తెల్లవారుజామున స్వామి వారి కళ్యాణ వేడుకలు జరగడం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ఆచారం.
తాత ముత్తాతల నుండి ఈ ఆచారం కొనసాగుతున్నట్లు ఇక్కడి ప్రాంత ప్రజల అభిప్రాయం. మోత్కూర్ లో గౌడ కులస్తులు అనాదిగా రామలింగేశ్వర ఆలయ గర్భ గుడిలో అఖండ దీపం (365 రోజులు నూనె)పెట్టె అవకాశం వచ్చింది. ఈ ఆనవాయితీ ఇప్పటికి కొనసాగుతుంది. నాటి రోజుల్లో మోత్కూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర కి చుట్టు పక్కల గుండాల, ఆత్మకూరు, అమ్మనబోల్, నార్కెట్ పల్లి, దేవరుప్పుల, జీడికల్, జనగామ, తిరుమలగిరి మండలాల నుండి జనం పెద్దఎత్తున తరలి వచ్చే వారు.

రానురాను ఆయా గ్రామాల్లో ఆలయాల నిర్మాణంతో అక్కడికక్కడే ప్రజలు స్థానికంగా వేడుకలు జరుపుకుంటున్నారు.శ్రీ రామలింగేశ్వర కల్యాణ వేడుకల్లో ఇప్పటికి సుమారు 20,25 జంటలు(సతీసమేతంగా) పాల్గొని కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కల్యాణం అనంతరం ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని హొలీ వేడుకలు ప్రారంభిస్తారు. పట్టణంలో సైతం స్వామి వారి కళ్యాణ వేడుకల అనంతరం హొలీ వేడుకలను యువతీయువకులు, చిన్నారులు, మహిళలు, వ్యాపారులు ఘనంగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
