ROAD ACCIDENT | ప్రమాదకర మలుపు.. పట్టించుకోని అధికారులు..

ROAD ACCIDENT | ప్రమాదకర మలుపు.. పట్టించుకోని అధికారులు..
ROAD ACCIDENT | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పరిధిలోని పాటిమట్ల గ్రామంలో ప్రమాదకర మూల మలుపు వద్ద మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనాల ప్రకారం.. ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మోత్కూరు లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎంగేజ్మెంట్ లో పాల్గొని తిరుమలగిరి వైపు వెళ్తున్న షిఫ్ట్ కారు పాటిమట్ల గ్రామంలోని మూల మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. కారు ఓవర్ స్పీడ్‌లో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

ప్రమాద సమయంలో కారులో తిరుమలగిరికి చెందిన నలుగురు వ్యక్తులు ఉండగా, అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ప్రయివేటు వాహనాల్లో సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదకర మూల మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్లు వేయాలని, బారీకేడ్లు ఏర్పాటు చేసి, రహదారి విస్తరణ చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే రూట్లో పాటిమట్ల చెరువు వెంట రోడ్డు పక్కన రోడ్డు కోతకు గురైనప్పటికీ, ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఆ పక్కనే వ్యవసాయ బావి ఉండడం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు, ప్రయాణికులు వాపోతున్నారు.
