ప్రళయ గాలి వర్షంతో కాళేశ్వరం కుదేలైంది

ప్రళయ గాలి వర్షంతో కాళేశ్వరం కుదేలైంది

భారీ వర్షానికి చెట్లు నేలకొరిగి ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి –
మిర్చి, పత్తి రైతులకు తీవ్ర నష్టం

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా విరుచుకుపడిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం గ్రామాన్ని అతలాకుతలం చేసింది. గంటకు సుమారు 60–70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగి ప్రధాన రహదారులపై పడిపోయాయి. పలు ఇళ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోవడంతో ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షానికి వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. కోత దశలో ఉన్న మిర్చి పంట పూర్తిగా నీట మునిగిపోయి పాడైంది. పత్తి తోటల్లో మొక్కలు నేలకూలి దిగుబడిపై ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. రైతులు ప్రభుత్వం తక్షణమే నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. స్థానిక రైతు మాట్లాడుతూ, “ఒక్క గంట గాలి, వర్షంతో మా పంటలు నాశనం అయ్యాయి. మా కష్టానికి ఫలితం లేకుండా పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది చెట్లు తొలగించి రహదారులు శుభ్రం చేయగా, విద్యుత్ శాఖ అధికారులు సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply