ఆయన మహనీయుడు

ఆయన మహనీయుడు
అందరికీ సమాన హక్కులు ఇచ్చాడు
అన్ని వర్గాలకు ఆయన సేవలు అమూల్యం
మొవ్వలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన
రాజ్యాంగ నిర్మాతకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నివాళి
బౌద్ధ సాంప్రదాయ పూజలతో కార్యక్రమం
( మొవ్వ – ఆంధ్రప్రభ)

రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కుల ఫలాలు అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. మొవ్వ మండలం మొవ్వ గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ బిక్షువు బంతేజి గౌతమ బుద్ధుని విగ్రహానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి బౌద్ధ సాంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ గుడివాడ నెహ్రూ చౌక్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల అభిమానాన్ని చూపడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు. మొవ్వ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కుల మత జాతి ప్రాంత భేదాలు లేకుండా అంబేద్కర్ అన్ని వర్గాలకు మేలు చేశారని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహనీయుని విగ్రహం మొవ్వ గ్రామంలో ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఆయన చూపిన అడుగు జాడల్లో మనమందరము నడుద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
