రజకులపై దాడులు స‌హించం

రజకులపై దాడులు స‌హించం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంతకాని శ్రీనివాస్

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో అమానుషంగా జరిగిన రజక కులస్తులపై దాడి చేసి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన అగ్రకుల అహంకారులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంతకాని శ్రీనివాస్ నేత డిమాండ్ చేశారు. మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ..

కొమ్మెర మల్లన్న జాతరలో దైవదర్శనానికి పసిపిల్లలతో వచ్చిన రజక కులస్తులైన గణేష్, చంద్రకళ, మౌనికలు దైవ దర్శనం కోసం క్యూలో నిలబడగా నిర్వాహకులు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడగగా అధికార పార్టీ సర్పంచ్ తుకారాంరెడ్డి ఆధ్వర్యంలో అతని అనుచరులు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డిలు గణేష్, చంద్రకళ, మౌనికలను కొబ్బరికాయలు కొట్టే రూమ్లో బంధించి దాడి చేయడమే కాకుండా, సభ్య సమాజం తలదించుకునేలా రెండు నెలల పసికందును కిందపడేసి మానవత్వం మరిచిపోయి కాళ్లతో తొక్కి దాడి చేయగా పసికందు చనిపోయింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు

ఈ సంఘటనపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అప్పటికే అక్కడికి చేరుకున్న సర్పంచ్ తుకారాం అతని అనుచరులు బాధితులను అక్క‌డి నుంచి బయటికి గెంటి వేయించారని తెలిపారు. అలాగే ఫిర్యాదు కాపీని మాయం చేశారు. రాజకీయ ఒత్తిడితో పోలీసులు కేసును నీరు కార్చే ప్రయత్నం చేయడమే కాకుండా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారాని తెలిపారు

ప్రభుత్వం వెంటనే స్పందించి “ఫాస్ట్ ట్రాక్ కోర్టు”ను ఏర్పాటుచేసి త్వరగా విచారణ జరిపించి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని బీసీ సమాజం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply