యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలి

యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలి
- మాజీ ఎంపీటీసీ సరితనగేష్ డిమాండ్
మర్రిగూడ, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా కొరతపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, యూరియా పంపిణీకి తీసుకొచ్చిన యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని నామపురం మాజీ ఎంపీటీసీ సరితనగేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా వారు మాట్లాడుతూ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో యూరియా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒక రైతు చేసిన ఆవేదన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. షాపుల్లో నేరుగా అందాల్సిన యూరియాను యాప్‌ల ద్వారా మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం వల్ల చదువులేని, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టిన పాత రోజులను తిరిగి తీసుకురావడమేనా ప్రజా ప్రభుత్వం తెచ్చిన మార్పు అని ఆయన ప్రశ్నించారు. నిరక్షరాస్య రైతులు యాప్‌ను ఎలా వినియోగిస్తారన్న కనీస అవగాహన కూడా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన సరితనగేష్, యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేసి, పాత విధానంలో ఎలాంటి షరతులు లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడించే స్థాయికి ఉద్యమం వెళ్తుందని ఆయన హెచ్చరించారు.
