మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన ప్రచారం..

మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన ప్రచారం..
15వ వార్డులో మారుమోగుతున్న ‘హస్తం’ నినాదం!
బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న వేదికలను ఎంచుకుంటున్నారు. బెల్లంపల్లి 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ఆదివారం చేపట్టిన ప్రచారం పట్టణంలో ఆకట్టుకుంది. వార్డులోని బస్తీలలో పర్యటిస్తున్న క్రమంలో ఆమె నేరుగా ఒక మటన్ షాపులోకి వెళ్లి, అక్కడ స్వయంగా కత్తి పట్టి మటన్ కొడుతూ ప్రజలను ఆశ్చర్యపరిచారు. సామాన్యులతో మమేకమవుతూ, ఒక అభ్యర్థిగా కాకుండా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి ఓట్లు అభ్యర్థించిన తీరు స్థానికులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా చింతల వసంత మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తిని అని, కౌన్సిలర్‌గా ఎన్నికైన తర్వాత ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారి అండదండలతో 15వ వార్డును పట్టణంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు భరోసా ఇచ్చారు.
గతంలో గెలిచిన కౌన్సిలర్లు ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని, కాలువల్లో పూడికలు తీయకపోవడంతో వార్డు మొత్తం దుర్వాసనతో అల్లాడిందని ఆమె మండిపడ్డారు. బస్తీలోని పలు గల్లీల్లో ఇప్పటికీ కరెంట్ స్తంభాలు సరిగ్గా లేవని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధికి ఆమె 10 సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. అందులో భాగంగా నూతన డ్రైనేజీలు, నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, పారిశుధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వీధి దీపాల సమస్యను పరిష్కరించి, నూతన కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తామని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీటి సరఫరా అందేలా చూస్తామని వాగ్దానం చేశారు.
అంతేకాకుండా నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, వీధి కుక్కల బెడద నివారణ, మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పోటీ పరీక్షల అభ్యర్థులకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేస్తున్నాయని, ఈ సంక్షేమ ఫలాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే, వార్డు ప్రజలకు సేవకురాలిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని విన్నవించారు. ఈ వినూత్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవసాని ఆనంద్, దెబ్బేటి రమేశ్, రాజ్ మహ్మద్,పులియాల మల్లేష్, చింతల బాలరాజు, చింతల లోకేశ్వర్, బొల్లి వంశి, బొల్లి పెరమయ్య, బొల్లి దేవమ్మ, లక్కి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
