AP | మొబైల్ షోరూంలో భారీ చోరీ

AP | మొబైల్ షోరూంలో భారీ చోరీ

  • రూ.17.92 లక్షల విలువైన ఖరీదైన మొబైళ్లు మాయం
  • విజయవాడలో ఘ‌ట‌న

AP | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : విజయవాడ పటమట ప్రాంతంలో ఉన్న సోనోవిజన్ మొబైల్ షోరూంలో భారీ చోరీ చోటుచేసుకుంది. దుండగులు షోరూం పైన ఉన్న చిన్న సందులో నుంచి లోపలికి ప్రవేశించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ చోరీ ఘటనలో ఖరీదైన ఐఫోన్ మోడళ్లతో పాటు మొత్తం 52 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ.17 లక్షల 92 వేల వరకు ఉంటుందని షోరూం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షోరూంలోని కౌంటర్లు, డిస్‌ప్లే ర్యాక్‌లు చిందరవందరగా ఉండటంతో దుండగులు ముందుగానే పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ క్రైమ్ ఏడీసీపీ రాజారావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. షోరూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు, దుండగులు లోపలికి ప్రవేశించిన మార్గం, చోరీ జరిగిన తీరు, ఉపయోగించిన పరికరాలపై సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. షోరూం యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు, సీసీటీవీ ఆధారాలు, పరిసర ప్రాంతాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖరీదైన ఐఫోన్లే ప్రధాన లక్ష్యంగా ఈ చోరీ జరిగి ఉండవచ్చన్న కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.

Leave a Reply