79th anniversary celebrations | ఉత్సవాలకు ముస్తాబు

79th anniversary celebrations | ఉత్సవాలకు ముస్తాబు
- యేసు నామకరణ దేవాలయంలో ఏర్పాటు
- నేడు దేవాలయంలో కొవ్వొత్తుల సమర్పణ.
- జనవరి 2 పండుగ దివ్య బలి పూజ
- గ్రామంలో ఉత్సవ స్వరూపాల తేరు ప్రదక్షణ
- జనవరి 3 మృతవీరుల పండుగ
79th anniversary celebrations | మునుగోడు, ఆంధ్రప్రభ :యేసు నామకరణ దేవాలయం ఉత్సవాలకు సిద్ధమైంది. మండల కేంద్రంలోని కమ్మగూడెం యేసు నామకరణ దేవాలయాన్ని 79 సంవత్సరాల వేడుకలకు సర్వదా సిద్ధం చేశారు. 1910వ సంవత్సరమున గుంటూరు జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు మునుగోడు గ్రామానికి వచ్చి 800 ఎకరాల ప్రభుత్వ భూమిని వారి శక్తియానుసారం కొనుగోలు చేసుకుని ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ ప్రథమ విచారణ గురువుగా ఫాదర్ పాస్కల్ నియమింపబడ్డారు. వారు మఠంపల్లి నుంచి నెలకు ఒకసారి వచ్చి ప్రార్థన సమావేశాలు ఒక చిన్న పూరి గుడిసెలో జరిపి, క్రైస్తవుల సాధక బాధలను తెలుసుకొని తగిన విధంగా ఆదుకునేవారు. 1946లో ఫాదర్ ఫినెల్లి హయాంలో చర్చి స్థాపించబడింది. ఏసుక్రీస్తు డిసెంబర్ 25 న జన్మించగా 8 వ రోజు నామకరణ చేసిన రోజును యేసు నామకరణ దేవాలయంగా పేరు పెట్టారు.
జిల్లాలోని పెద్ద చర్చిల్లో ఒకటిగా ఈ చర్చ్ ఉంది. దేవాలయ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్ బిషప్ వచ్చి ప్రారంభించారు. దేవాలయ అభివృద్ధి, మత వ్యాప్తి, విద్యావ్యాప్తి కొరకు రాయల ప్రాంచీస్ అను పంతులను నియమించారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఆనవాయితీగా ఇక్కడ క్రైస్తవులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జనవరి 1వ తేదీన కొవ్వొత్తులను గ్రామంలో ప్రదర్శించి దేవాలయంలో సమర్పిస్తారు. 2వ తేదీ ఉదయం మహాఘణత వహించిన గురువులచేే గ్రామ శ్రేయస్సు, అభివృద్ధి కొరకు పండుగ దివ్యబలి పూజ నిర్వహిస్తారు. సాయంకాలం వేళ గ్రామంలో ఉత్సవ స్వరూపాలను తేరు ప్రదక్షణగా ప్రార్థనలు చేస్తూ, డప్పు చప్పుళ్లతో, బాణాసంచా కాలుస్తూ ఊరేగిస్తారు. అనంతరం మొక్కుబడులు చెల్లించుకుంటారు. 3వ తేదీ గ్రామంలో చనిపోయిన మృతవీరులను(పెద్దలను) స్మరించుకుంటూ పండగ నిర్వహిస్తారు. రాతి కట్టడంతో కట్టిన అపురూపమైన దేవాలయాన్ని చూడడానికి, ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రంల నుంచి భక్తులు అనేకులు విచ్చేసి ప్రార్థనలో పాల్గొంటారు.
