రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలి…

రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలి…
ఓపీ కౌంటర్ లు అదనంగా ఏర్పాటు చేయండి..
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల పై సంతృప్తి వ్యక్తం చేసిన పేషెంట్ లు…
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని లో ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ, ఆర్థో, సర్జికల్, ఫార్మసీ, మేల్, ఫీమేల్ మెడికల్ వార్డు, టెలీ రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మెహబూబ్ బీ అనే పేషెంట్ తో మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తున్నారా? మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారా? అని ఆరా తీశారు.. పేషెంట్ మాట్లాడుతూ బయట ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ చాలా బాగా అందిస్తున్నారని తెలిపారు. అదే విధంగా భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, చాలా బాగా ఉందని తెలిపారు. ఇతర పేషంట్లతో కూడా కలెక్టర్ మాట్లాడి, వారి ఆరోగ్య విషయాలను గురించి తెలుసుకున్నారు.

ఆర్థో, సర్జికల్ ఓపీ విభాగంలో పర్యటించి కేసుల నమోదు గురించి పరిశీలించారు.. పేషెంట్ వివరాలను మాన్యువల్ గా ఎంట్రీ చేయడంతో పాటు వారు తీసుకుంటున్న చికిత్స సంబంధిత వివరాలను అన్నిటిని నెక్స్ట్ జెన్ పోర్టల్ లో తప్పకుండా అప్లోడ్ చేయాలని కలెక్టర్ జనరల్ సర్జన్ ను ఆదేశించారు. ఫార్మసీ స్టోర్ ను పరిశీలిస్తూ మందులు అందుబాటులో ఉన్నాయా, త్వరలో గడువు ముగియనున్న మందులు ఏవి ఉన్నాయని ముందుగానే వెరిఫై చేసుకోవాలన్నారు.. మందుల కొరత చోటు చేసుకోకుండా ముందుగానే స్టాక్‌ను అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

మేల్, ఫీమేల్ మెడికల్ వార్డు లను పరిశీలిస్తూ టెస్ట్ లకు బయట రాసి పంపిస్తున్నారా? వైద్యులు సరైన సమయానికి అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? టాయిలెట్ లు ఏ విధంగా ఉన్నాయి? అని ఆరా తీశారు.. వైద్యులు అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నారని, టెస్ట్ లకు బయటికి పంపడం లేదని, వైద్యులు అందిస్తున్న వైద్య సేవల పై పేషెంట్ లు సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి రోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు దాదాపు 700 మందికి పైగా వస్తున్న నేపధ్యంలో ఓపీ కౌంటర్ లు అదనంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్ ను పరిశీలిస్తూ నెలకు ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి? అందులో మేజర్, మైనర్ కేసులు ఎన్ని ఉన్నాయని, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల పర్యవేక్షణ, మందుల పంపిణీ, భోజన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రోగులు…
అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఓపి చాలా ఎక్కువగా ఉందని, రోజుకు సుమారు 600 నుండి 700 మంది రోగులు వస్తున్నారన్నారు. ఆసుపత్రిలో వైద్యులు ఉన్నారు, స్టాఫ్ నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది కొంత కొరత ఉందన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. వైద్యులు రోజుకు మూడుసార్లు వచ్చి రోగులను పరీక్షిస్తున్నారని, మందులు సరిగ్గా అందుతున్నాయని, ఆసుపత్రిలో భోజన సదుపాయం బాగుందని రోగులు తెలిపారన్నారు.
టాయిలెట్లు పరిస్థితి మెరుగుపరచాలని, కొంతమేర మరమ్మత్తులు చేపట్టాలన్నారు. టాయిలెట్ల మరమ్మతుల కోసం ఏపిఎంఎస్ఐడిసి సిబ్బందితో అంచనాలు వేయించి, చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా సెల్యులైటిస్ వంటి ఇన్ఫెక్షన్ కేసులకు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ఇక్కడే మెరుగైన వైద్యం అందుతోందని రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, ఆదోని జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగరాజు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏఓ సింధు సుబ్రమణ్యం, డి సి హెచ్ ఎస్ జఫ్రుల్లా, ఆదోని తహసిల్దార్ శేషపాణి, తదితరులు పాల్గొన్నారు.
