ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…

ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • సమస్యల తక్షణ పరిష్కారాలకు హామీ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. కొండపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. 60 మంది అర్జీలు సమర్పించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా విని, వాటికి సంబంధించిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. హౌసింగ్, రెవెన్యూతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం… జనహితమే మనహితం అన్న నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కొండపల్లిలో శ్మశానవాటిక అభివృద్ధితో పాటు వివిధ సమస్యలపై చర్చించి, అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. జననివాస ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేని చోట తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అలాగే ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply