కామారెడ్డిలో భారీ చోరీ

కామారెడ్డిలో భారీ చోరీ
- 40 తులాల బంగారం, నగదు అపహరణ
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది.
వివరాల ప్రకారం, అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అడ్డగుల్ల బాలకృష్ణ రాజంపేటలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. శనివారం రోజున కుటుంబంతో కలిసి ఆస్పత్రి పనిమీద ఫ్లాట్‌కు తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న దొంగలు ఆదివారం రాత్రి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

సోమవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు పరిశీలనలు చేపట్టారు. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ చోరీలో సుమారు 40 తులాల బంగారం, 60 తులాల వెండి, అలాగే రూ. లక్ష నగదు అపహరించబడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుండగా, పోలీసులు అపార్ట్‌మెంట్ మరియు పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పట్టణ సీఐ నరహరి తెలిపారు.
