310 acres | దీవి కోత సమస్యను పరిష్కరించాలి

310 acres | దీవి కోత సమస్యను పరిష్కరించాలి

  • అసెంబ్లీలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

310 acres | అవనిగడ్డఆంధ్రప్రభ : నియోజకవర్గంలో కీలక సమస్యగా తమను క్షోభకు గురి చేస్తున్న పాత ఎడ్లంక దీవి కోత సమస్యను పరిష్కరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాత ఎడ్లంక దీవి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతమైన తమ నియోజకవర్గంలో నదిలో ఏర్పడిన అనేక దీవుల్లో ఒక దీవి అయిన పాత ఎడ్లంక తీవ్ర స్థాయిలో కోతకు గురవుతోందని తెలిపారు.

గత ప్రభుత్వం పాత ఎడ్లంక దీవి పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీవి పరిరక్షణకు చర్యలు చేపడతామని ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు తెలిపారు. గతంలో భారీ వరదలు వచ్చినా పాత ఎడ్లంకకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదన్నారు. అయితే గత వైసిపి హయాంలో విచ్చలవిడిగా సాగిన ఇసుక తవ్వకాలు, కృష్ణానది ప్రవాహ గతిలో మార్పు రావటంతో పాత ఎడ్లంక దీవి కోత తీవ్రత పెరిగిందన్నారు. 2023-24లో వచ్చిన వరదలకు పాత ఎడ్లంక దీవిలో 15ఇళ్ళు, 300 ఎకరాలు భూమి కృష్ణానదిలో కలిసి పోయాయన్నారు.

తాజాగా మరో 48 గృహాలు నదిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పాత ఎడ్లంక దీవిని పరిరక్షించవలసిన అవసరం ఉందన్నారు. లేకుంటే గ్రామం మొత్తం కృష్ణా నదిలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. తక్షణమే పాత ఎడ్లంక దీవి గ్రామ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాత ఎడ్లంకలో 257 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు.

ఈ గ్రామం సముద్ర మట్టానికి ఆరు మీటర్ల ఎత్తులో ఉందన్నారు. 2019 నుంచి ఈ గ్రామానికి కోత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. కృష్ణానది ప్రవాహ మార్గం దిశ మార్చుకొని డైరెక్టుగా పాత ఎడ్లంక ల్యాండ్ మీద ప్రెజర్ పడుతున్న నేపథ్యంలో కోత ప్రభావం పెరిగిందన్నారు. 2024లో కృష్ణా నదికి అత్యధికంగా వచ్చిన 11.47 లక్షల క్యూసెక్కుల వరద సమయంలో ఈ దీవి గ్రామం కోతకు గురైందని, తాజాగా రెండు, మూడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా కోతకు గురవుతూనే ఉందన్నారు.

నది కోత కారణంగా ఈ గ్రామం 310 ఎకరాల భూమిని కోల్పోయిందని, కృష్ణానది ఈ గ్రామంలోకి 200 మీటర్ల మేరకు చొచ్చుకు వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి 2025 అక్టోబరులో జల వదరుల శాఖ ఎస్ఈ, ఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టరులతో త్రిమెన్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను అధ్యయనం చేసి మూడు పరిష్కార మార్గాలు సూచించినట్లు తెలిపారు. పాత ఎడ్లంక దీవిలో ఉన్న 257 కుటుంబాలకు సురక్షిత ప్రాంతానికి తరలించి పక్కా గృహాలు నిర్మించే ప్రతిపాదనను నివాసితులు తిరస్కరించారని తెలిపారు. మరో ప్రతిపాదనగా ఎడ్లంకలో అప్రూవ్డ్ లే-ఔటులో నివేశన స్థలాలు గృహాలు మంజూరు చేసే ఆలోచన ఉందన్నారు.

ఈ రెండు ప్రతిపాదనలు కానీ పక్షంలో పాత ఎడ్లంక దీవి కోత సమస్య పరిష్కారానికి రూ.50 కోట్లతో చుట్టూ గ్యాబింగ్ వాల్ నిర్మించి రక్షణ కల్పించేందుకు ప్రతిపాదన మేరకు అంచనాలు రూపొందించామని తెలిపారు. ఇది ప్రస్తుతం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వద్ద పెండింగులో ఉందన్నారు. ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉందన్నారు. తమ పాత ఎడ్లంక దీవి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వహిస్తున్న శ్రద్ధకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply