AP | వైవీ విక్రాంత్ రెడ్డికి ముంద‌స్తు బెయిల్ ..

వెల‌గ‌పూడి, ఆంధ్ర‌ప్ర‌భ : కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కాకినాడ సెజ్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. కేవీఆర్ గ్రూపున‌కు చెందిన వాటాలు అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 6న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ త‌ర్వాత నేడు మ‌రోసారి విచార‌ణ జ‌రిగింది.

ఈ కేసులో ఏ-1గా ఉన్న విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాద‌న‌లు విన్న హైకోర్టు న్యాయ‌మూర్తి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో విక్రాంత్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని సీఐడీ పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. ఇదే సంద‌ర్భంగా ఆత‌డిని అరెస్ట్ చేయ‌కుండా ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌‌లోని వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయించుకున్నారని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కేవీఆర్‌ గ్రూపునకు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు డిసెంబర్ 2న చేసిన ఫిర్యాదుతో మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని, వ్యాపారాల్ని మూయించేస్తామని బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో జగన్‌‌కు వరుసకు సోదరుడైన వై.విక్రాంత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి పి.శరత్‌చంద్రారెడ్డి, పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ ఆడిట్‌ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *