Yadadri | కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్రేమ ఎందుకో?

Yadadri | కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్రేమ ఎందుకో?

  • గాలి.. నీరు.. పంట‌లు కాలుష్యం
  • వ్యాధుల‌ను బారిన ప‌డుతున్న ప్ర‌జ‌లు

Yadadri | చౌటుప్ప‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గాలి.. నీరు.. పంట‌ల కాలుష్యానికి కార‌ణ‌మైన ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవడం లేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా చౌటుప్ప‌ల్ డివిజ‌న్‌లో ఏర్పాటు చేస్తున్న ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లు(Chemical industries) నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో గాలి, నీరు, పంట‌లు కాలుష్య‌మ‌వుతున్నాయ‌ని ప్ర‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం పరిధిలో ఉన్న శ్రీజయ లాబోరేట‌రీస్‌, పోచంపల్లి మండలంలోని అంతమ్మ గూడెం స‌మీపాన‌ హజేలో తదితర పరిశ్రమలు ఉన్నాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉత్ప‌త్తులు త‌యారు చేస్తున్నారని స‌మాచారం. ఈ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల నుంచి వెలువ‌డే వాయువు, వృథా జ‌లం వ‌ల్ల ఈ ప్రాంతంలోని జ‌ల‌, వాయు కాలుష్యం(Air Pollution) అవుతున్నాయ‌ని, వీటి బారిన ప‌డిన వారు రోగాల బారిన ప‌డుతున్నార‌ని ఆయా గ్రామ‌స్థులు ఆవేద‌న చెందుతున్నారు.

ఈ మేర‌కు ప‌లుమార్లు పొల్యూష‌న్ బోర్డు (పీసీబీ)కి, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌కు పలుమార్లు వినతి పత్రాలను కూడా అంద‌జేసిన‌ట్లు బాధిత రైతులు గుమ్మి దామోదర్ రెడ్డి, గుమ్మి నరేందర్ రెడ్డి, వస్పరి నరసింహ, వస్పరి లింగయ్య, వస్పరి రేణుక తదితరులు తెలిపారు. అయినా ఇంత‌వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని వాపోయారు.

ప్రధానంగా శ్రీజయ లాబోరేటరీస్‌ పరిశ్రమ నుంచి విడిచిపెట్టిన ర‌సాయ‌న వ్య‌ర్థాలు పరిశ్రమ దక్షిణ భాగంలో గత మూడేళ్లుగా గుట్ట నుంచి వచ్చే నీటిలో ర‌సాయ‌న వ్య‌ర్థాలు క‌లుస్తున్నాయి. ఆ నీరు భూమిలోకి ఇంకుతుంది. రసాయన వ్య‌ర్థాలు ఊట రూపంలో బయటికి వస్తున్నాయి.

అంతేకాకుండా త‌ర‌చూ రసాయన వ్య‌ర్థాల‌ను పరిశ్రమ బయట వదిలి వేస్తున్న కారణంగా వర్షపు నీటి(rain water)లో రసాయనాలు కలుస్తూ దిగువకు ప్రవహిస్తుండగా వాటిని తాగిన‌ అటవీ జంతువులు, పక్షులు తదితర మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు రసాయన వ్య‌ర్థ‌ జలాలను బయటకు వదలడమే కాకుండా, గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్(October) మాసాలలో కూడా రసాయనాలు వదిలినట్టుగా టీజీపీసీబీ నివేదికల ప్రకారం గుర్తించారు.

అదేవిధంగా అంతమ్మగూడెం గ్రామం పరిధిలో ఉన్న హజేలో లాబోరేటిరీస్‌ పరిశ్రమ నుంచి కూడా వ్య‌ర్థాల వ‌ల్ల కాలుష్యమ‌వుతుంది. ఈ పరిశ్రమల నుంచి వెలువ‌డే వాయు, జల కాలుష్యం కారణంగా త‌మ గ్రామ ప్రజలు చర్మ రోగాలు, కళ్ల మంట, తలనొప్పి, పునరుత్పత్తి సమస్యలతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జన్యు సంబంధమైన దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నామని తెలిపారు.

ఫిర్యాదులు చేయవద్దని గ్రామ‌స్థుల‌పై బెదిరింపులకు పాల్ప‌డుతున్నార‌ని, ప‌రిశ్ర‌మ‌ల నుంచి కాలుష్యాన్ని విడుదల చేయడం లేదని, తమకు ఎటువంటి దుర్వాసన రావడం లేద‌ని సంతకాలు చేయాలని గ్రామస్థులపై ఒత్తిడి చేసినప్పటికీ వారు అంగీక‌రించ‌లేద‌ని తెలిసింది. పరిశ్రమలకు దూరంగా ఉన్న జుబ్లక్ పల్లి(Zublak Palli) గ్రామస్థుల‌ను ప్రలోబాలకు గురిచేసి తమకు అనుకూలంగా సంతకాలు పెట్టించుకున్నట్లుగా తెలుస్తుంది.

ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటి నుంచి పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కాలుష్య కారక పరిశ్రమలను ఇక్కడి నుండి శాశ్వతంగా తరలించాలని పీసీబీ మెంబర్ సెక్రెటరీని, ఇతర ఉన్నత అధికారులను బాధితులు వేడుకుంటున్నారు.

చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్ మండలాలలో భూములు కాలుష్యానికి గురైన‌ట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించిన‌ప్ప‌టికీ ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు.

ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యాలు(Industrial Ownership) ప్ర‌లోబాల‌కు గురై త‌ప్పుడు రిపోర్టులు ఇస్తున్నార‌ని ప్ర‌జ‌లు అనుమానిస్తున్నారు. కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

చౌటుప్పల్ డివిజన్ లోని అంతమ్మగూడెం గ్రామానికి చెందిన కాలుష్య బాధితుడు రావుల శశికిరణ్ మాట్లాడుతూ త‌న‌కు ప‌దేళ్ల వయసు వచ్చేవరకు అందరు పిల్లల మాదిరిగా తాను ఆరోగ్యంగా ఉండి స్వయంగా పాఠశాలకు వెళ్లేవాణ్ణి, గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమల కాలుష్యం కారణంగా ప్రస్తుతం చక్రాలు కుర్చీకి ప‌రిమిత‌మ‌య్యాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌మ గ్రామ పరిసరాలలో ఉన్న పరిశ్రమలు కాలుష్యంపై మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కార్యాలయం(Prime Minister’s Office) వరకు ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, హైకోర్టు న్యాయమూర్తిని, మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి విచ్చేసిన సీఎంని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. ఇప్ప‌టికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Leave a Reply