- ఆసీస్ ఆలౌట్
- దక్షిణాఫ్రికా లక్ష్యం 282
- 9 పరుగులకే తొలి వికెట్ !
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌లో మూడోరోజు ఉత్కంఠంగా సాగింది. చివరి వికెట్ కోసం ఇబ్బంది పడిన దక్షిణాఫ్రికాకు బ్రేక్ లభించింది. చాలా సేపు సఫారీలను ఇబ్బంది పెట్టిన ఆసీస్ టెయిలెండర్ల అవుట్ అవ్వడంతో, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగుల వద్ద ముగిసింది. దీంతో 282 పరుగుల విజయ లక్ష్యం దక్షిణాఫ్రికా ఛేజ్ ప్రారంభించింది.
అయితే తరువాత ఛేజ్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాకు షాక్ తగిలింది. కేవలం 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఓపెనర్ రియన్ రికెల్టన్ (6) పరుగులకే నిరాశపరిచాడు. ఇక ప్రస్తుతం క్రీజులో ఐడెన్ మార్కరమ్ – వియాన్ ముల్డర్ ఉన్నారు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఇలా !
రోజు ఆరంభంలో మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ క్రీజులోకి వచ్చారు. కానీ, కగిసో రబాడా మూడు ఓవర్లలోనే లియోన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్టార్క్‌కు జతగా జాష్ హేజిల్‌వుడ్ (17) వచ్చాడు. ఇద్దరూ ఓపికగా ఆడి దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన లూజ్ బంతులను చక్కగా ఉపయోగించుకున్నారు.
ఈ క్రమంలోనే స్టార్క్ (58 నాటౌట్) తన 11వ టెస్ట్ హాఫ్ సెంచరీని 132 బంతుల్లో పూర్తి చేశాడు. హేజిల్‌వుడ్‌తో కలిసి 59 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరకు ఐడెన్ మార్క్రమ్ హేజిల్‌వుడ్‌ను అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ తడబడినా, చివరి మూడు వికెట్లలో 134 పరుగులు వచ్చాయి.
ఈ ఇన్నింగ్స్‌లో కగిసో రబాడా 4/59తో చెలరేగాడు. మొత్తం మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసి ధాటిగా రాణించాడు. లుంగి ఎన్‌గిడీ 3/38తో మెరుపులు మెరిపించగా, జాన్సెన్ (1/58), వియన్ ముల్డర్ (1/18), మార్క్రమ్ (1/5) తలా ఒక్కో వికెట్ తీశారు.
ఇప్పుడు దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల భారీ లక్ష్యం ఉంది. అయితే, ప్రపంచ స్థాయి బౌలింగ్ యూనిట్‌ను కలిగి ఉన్న ఆస్ట్రేలియాను ఎదుర్కొనాలంటే ప్రొటియాస్ బ్యాటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిందే. దీంతో మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.