- వింబుల్డన్ 2025 ట్రోఫీ గెలుచుకున్న స్టార్లు వీరే!
ప్రపంచ టెన్నిస్ అభిమానుల హృదయాలను ఉర్రూతలూగించిన వింబుల్డన్ 2025 (Wimbledon 2025) ఈసారి కొత్త చాంపియన్లతో, సరికొత్త రికార్డులతో ముగిసింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్లామ్ టోర్నీ అనేక మైలురాళ్లను సృష్టించి, కొత్త చరిత్రను రాసింది.
పురుషుల సింగిల్స్ (Men’s singles) – ఇటలీకి కొత్త హీరో!
వింబుల్డన్ చరిత్రలో జానిక్ సిన్నర్ (Jannik Sinner) ఇటలీ తరపున తొలి పురుషుల టైటిల్‌ను గెలుచుకున్నాడు. స్పానిష్ స్టార్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)పై 4–6, 6–4, 6–4, 6–4తో ఘన విజయం సాధించాడు. వింబుల్డన్‌లో ఇది సిన్నర్‌కు తొలి టైటిల్ కాగా, మొత్తం నాల్గవ గ్రాండ్ స్లామ్ (Grand Slam) విజయం కావడం విశేషం.

మహిళల సింగిల్స్ (Women’s Singles) – పోలాండ్ చరిత్రలో సువర్ణ పుట
పోలాండ్ క్వీన్ ఇగా స్వియాటెక్ (Iga Swiatek) , ఫైనల్‌లో అమెరికన్ అమండా అనిసిమోవాను 6–0, 6–0తో డబుల్ బాగెల్ (double bagel)తో చిత్తుచేసింది. ఇది స్వియాటెక్ తొలి వింబుల్డన్ కప్ కాగా, మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్‌లు సాధించి కెరీర్ గ్రాండ్ స్లామ్ (హార్డ్, క్లే, గ్రాస్) పూర్తి చేసిన ప్లేయర్ గా ఆమె చరిత్రలో ఒక మైలురాయిని సాధించింది.

పురుషుల డబుల్స్ (Men’s Doubles)– బ్రిటన్‌కి 89 ఏళ్ల తర్వాత గర్వ క్షణం
బ్రిటిష్ జోడీ జూలియన్ క్యాష్ – లాయిడ్ గ్లాస్పూల్ (Julian Cash – Lloyd Glasspool), ఆస్ట్రేలియా రింకీ హిజికాటా – నెదర్లాండ్స్ డి.పెల్ జంటపై 6–2, 7–6తో విజయం సాధించి 1936 తర్వాత వింబుల్డన్ పురుషుల డబుల్స్ గెలిచిన తొలి ఆల్-బ్రిటిష్ (All-British) జోడీగా చరిత్ర సృష్టించారు.

మహిళల డబుల్స్ (Women’s Doubles) – కొత్త జోడీకి కొత్త గెలుపు
రష్యా కుదెర్మెటోవా (Kudermetova), బెల్జియం ఎలిస్ మర్టెన్స్ (Elise Mertens) కలసి లాట్వియాకు చెందిన జెలెనా ఓస్టాపెంకో – తైవాన్ సు-వే హ్సియె జంటను 3–6, 6–2, 6–4తో ఓడించారు. కుదెర్మెటోవాకు ఇది తొలి మేజర్ టైటిల్ కాగా, మర్టెన్స్‌కు ఐదవ మహిళల డబుల్స్ గ్రాండ్ స్లామ్ గెలుపు కావడం విషేశం. రీ-యూనియన్ కాంబినేషన్‌గా వీరికి ఇది తొలి విజయంగా నిలిచింది.

మిక్స్‌డ్ డబుల్స్ (Mixed Doubles) – కొత్త కాంబోకు తీపి విజయం
నెదర్లాండ్స్ సాండర్ వెర్బీక్ (Sander Verbeek), చెక్ ప్లేయర్ కటేరినా సినియాకోవా (Katerina Sinyakova) జంట లుయిసా స్టెఫానీ, జో సాలిస్బరీ జంటపై 7–6, 7–6తో గెలిచింది. వెర్బీక్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, సినియాకోవాకు ఇది పదకొండు గ్రాండ్ స్లామ్ టైటిల్ (వుమెన్స్, మిక్స్ కలిపి) కావడం విశేషం.

(Junior categories) జూనియర్ విభాగాల్లోనూ రికార్డులు…
బాయ్స్ సింగిల్స్: బాయ్స్ సింగిల్స్లో బల్గేరియాకు చెందిన ఇవాన్ ఇవానోవ్ (Ivan Ivanov) అమెరికన్ రోనిట్ కార్కీని 6–2, 6–3తో ఓడించి తన మొదటి జూనియర్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. 2008లో గ్రిగోర్ దిమిత్రోవ్ తర్వాత జూనియర్ గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి బల్గేరియన్ అయ్యాడు.

గర్ల్స్ సింగిల్స్: గర్ల్స్ సింగిల్స్లో మియా పొహాంకోవా (Mia Pohankova) (స్లోవాకియా) అమెరికాకు చెందిన జూలియటా పరిగాను 6–3, 6–1తో ఓడించి స్లోవేకియా ఛాంపియన్‌షిప్ పరుగును రెండో ఏడాది కొనసాగించింది.

బాయ్స్ డబుల్స్: బాయ్స్ డబుల్స్లో ఫిన్‌లాండ్ ఆటగాడు పాల్డానియస్, పోలాండ్‌కు చెందిన అలన్ వాజ్ని (Paldanius, Alan Vazni) కలసి UK ఆటగాడు బాండింగ్, USAకి చెందిన జగర్ లీచ్ పై 5–7, 7–6, [10–5]తో గెలిచి “చానల్ స్లామ్” పూర్తి చేశారు.

గర్ల్స్ డబుల్స్: గర్ల్స్ డబుల్స్లో చెక్ జోడీ క్రిస్టినా పెనికోవా – వెండులా వాల్డ్‌మానోవా అమెరికన్ జంట ఫ్రోడిన్ – పరిగాలను 6–4, 6–2తో ఓడించి టైటిల్ దక్కించుకున్నారు.

వీల్‌చెయిర్ విభాగంలో చైనా చరిత్ర
పురుషుల వీల్‌చెయిర్ సింగిల్స్: జపాన్ టోకిటో ఓడా (Tokito Oda), UK డిఫెండింగ్ చాంపియన్ ఆల్ఫీ హ్యువెట్‌ను 3–6, 7–5, 6–2తో ఓడించి రెండో వింబుల్డన్ వీల్‌చెయిర్ టైటిల్, ఆరో సింగిల్స్ మేజర్ సాధించాడు.

మహిళల వీల్‌చెయిర్ సింగిల్స్: చైనా వాంగ్ జియింగ్, జపాన్ యుయి కమిజీపై 6–3, 6–3తో గెలిచి చైనా తరపున తొలి వీల్‌చెయిర్ మేజర్ సాధించింది.
