సూచ‌న‌లివ్వండి… బంద‌రు ప్ర‌జ‌ల‌కు మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానం..

  • సమస్యల్లేని నియోజకవర్గంగా బందరును తీర్చిదిద్దుతా …
  • ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
  • నియోజకవర్గంలోని ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తాం
  • మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, (ఆంధ్రప్రభ): నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా, ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రధానంగా పెన్షన్లు, ఇళ్ల పట్టాల గురించిన గ్రీవెన్స్ వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించి ప్రతి ఒక్కరికీ తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తోంది. వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాం. ఒకవైపు సంక్షేమం అభివృద్ధి చేస్తూనే.. సమస్యల పరిష్కారానికీ పెద్దపీట వేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అందుకు తాజాగా వచ్చిన తుపాను సమయంలో వారి పనితీరు నిదర్శనం అన్నారు. తుపాను తీరం దాటే సమయంలో ఆర్టీజీఎస్‌ నుండి పరిస్థితిని నిత్యం పర్యవేక్షించి ప్రాణ నష్టం సంభవించకుండా చూసుకున్నారు. అధికారుల్ని అప్రమత్తం చేసి తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం.

తుపాను సమయంలో పార్టీ నాయకులు, అధికారుల పనితీరు అభినందనీయం. తీరం దాటే సమయంలో ఇళ్ల నుండి ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వలన ప్రాణ నష్టం నిలువరించగలిగాం. 90 కి.మీల పైబడిన వేగంతో వచ్చిన గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, అధికారుల సమన్వయంతో 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్దరించాం.

కూలిన చెట్లును గంటల వ్యవధిలోనే తొలగించి రవాణాకు ఆటంకాలు లేకుండా చూసుకున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు కూడా సూచనలు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా మారుద్దామన్నారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా వస్తున్నాయని, వాటన్నింటినీ వీలైనంత వరకు పరిష్కరించి పేదలకు అండగా ఉంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Leave a Reply