అండగా ఉంటా…

  • 42 ఫ్లాట్ యజమానులకు న్యాయం జరిగేదెప్పుడు..
  • లోకేష్, పవన్ కి చెప్పిన పట్టించుకోలేదు..
  • నిరుపేదలపై దౌర్జన్యం
  • పోలీసుల తీరు ఆ శాఖకి మాయని మచ్చ..
  • వైసిపి నేతలు దేవినేని, వెల్లంపల్లి, మల్లాది..

ఆంధ్రప్రభ, భవానిపురం : భవానిపురంలోని 42 ఫ్లాట్ల బాధితులకు న్యాయపరంగా సహాయం చేయడంతో పాటు, రాజకీయంగా కూడా అండగా ఉంటామని ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయాలని లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌కు చెప్పినా పట్టించుకోలేదని, నిరుపేదలపై ఇలాంటి దౌర్జన్యం చేయడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్లాట్ల బాధితులపై పోలీసులు చేసిన దౌర్జన్యం ఆ శాఖ తీరు మీద చెరగని మచ్చలా మిగిలిపోతుందని ఆయన విమర్శించారు. విజయవాడలోని భవానిపురం 42 ఫ్లాట్స్ వద్దకు వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ మంత్రి, వెస్ట్‌ ఇంఛార్జ్‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌, సెంట్రల్‌ ఇంఛార్జ్‌ మల్లాది విష్ణు, మేయర్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

కూల్చివేసిన ఇళ్లను పరిశీలించిన నాయకుల వద్ద బాధితులు తమ వేదనను వివరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ… ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200మంది పోలీసులు రౌడీల్లా వచ్చి, ఇళ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి కూల్చేశారని ఆరోపించారు.

నారా లోకేష్‌, జనసేన కార్యాలయాలకు వెళ్లి చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఇళ్ల కూల్చివేత వెనుక నారా లోకేష్‌ ఉన్నారని, ఎంపీ చిన్ని తన మ‌నుషులను పంపి స్థలం ఆక్రమించాలనే చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీ చిన్ని ఎందుకు ఈ ప్రాంతానికి రాకపోతున్నారని ప్రశ్నించారు. నారా లోకేష్‌ డబ్బులు ఇచ్చేవారికే పనులు చేస్తారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదని అవినాష్ అన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు తలదించుకునే విధంగా ఉందన్నారు.

వచ్చే వారం జగన్‌ను కలిసేలా చేస్తామని, న్యాయపరంగా వెళ్లాలా లేక రాజకీయంగా ఎదుర్కోవాలా అనే అంశంపై చర్చిస్తామని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అని, ఇది అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. చట్టంలోని లొసుగులను ప్రభుత్వం ఎందుకు సరిచేయడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చే ప్రభుత్వం అధికారంలో ఉందని, కబ్జా దారులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని విమర్శించారు. బుల్డోజర్లతో కొంపలు కూల్చడం ఏమిటి? అసలు ప్రభుత్వం ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పేద ప్రజల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రాజకీయ ప్రయోజనం కాదు, మానవీయ కోణంలో ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ ఏమి చేస్తున్నారు? అర్జీలు తీసుకుంటే పరిష్కారం చేయరా? పేదల తరఫున ఉంటారా? కబ్జాదారులపక్షానా? అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.

Leave a Reply