WGL | దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం

WGL | దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం

  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ కు 12.08 కోట్లు..

హనుమకొండ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ సమావేశమైనారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసాయి. లోతట్టు ప్రాంతాల్లో నివాసపు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. నష్ట పరిహారం మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ముఖ్యమంత్రి పరిశీలించి, బాధితులకు అండగా ఉండేలా చర్యలు చేపట్టారని అన్నారు. హనుమకొండ జిల్లాకు రూ.7.03 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ. 5.05 కోట్లు, మొత్తం రూ.12.08 కోట్ల వరద సాయం 2 జిల్లాలకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సహాయం కాదు, ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. అక్టోబర్ 31న వర్షాలు పడితే, నవంబర్ 11 నాటికే నిధులు నేరుగా మంజూరు చేయడం ప్రభుత్వ స్పందన ఎంత వేగంగా ఉందో గమనించాలన్నారు. మునుపటి ప్రభుత్వాల కాలంలో పేపర్ ప్రకటనలతోనే హామీలు ఇచ్చి, ప్రజల కష్టాలను మరచిపోయారని విమర్శించారు.

బాట పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి బయలుదేరిన కవిత పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవీ శ్రీనివాస్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply