Well done | రేవంత్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు
హైదరాబాద్ – రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. రేవంత్ రెడ్డి సుదూరదృష్టిని, సమర్థమైన ఆలోచన విధానాన్ని, సమాజ హితం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా కొనియాడింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి డబ్ల్యుఈఎఫ్ లేఖను రాసింది.
ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అభివృద్ధికి అమలు చేస్తున్న ప్రణాళికలు, నగర రవాణా వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే ప్రణాళికలు బాగున్నాయని పేర్కొంది. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించి, వృద్ధిని న్యాయబద్ధంగా ప్రజలందరికీ చేరువ చేయడం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై ఆయన అవలంబిస్తున్న స్పష్టమైన విధానాలను డబ్ల్యుఈఎఫ్ తన లేఖలో ప్రస్తావిస్తూ ప్రశంసించింది. రాబోయే పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా మారుతుందన్న రేవంత్ మాటలు డబ్ల్యుఈఎఫ్ సదస్సుకు హాజరైన పెట్టుబడుదారులకు స్ఫూర్తినిచ్చాయని పేర్కోంది.