Weather | ఆ మూడు జిల్లాలలో నేడు కుంభవృష్టే…

హైదరాబాద్ – నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓ మూడు జిల్లాల్లో కుండపోత వానలకు ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకైతే ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. జూన్ లో లోటు వర్షపాతం నమోదవగా జులైలో అయినా వరుణుడు కరుణిస్తాడని తెలుగు ప్రజలు భావించారు. భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఈ నెలంతా భారీ వర్షాలుంటాయి తెలిపింది. కానీ జులైలో కూడా తొమ్మిదో రోజుకు చేరుకున్నాం… కానీ ఇప్పటివరకు ఒకట్రెండుసార్లు భారీ వర్షాలు కురిసాయి.. అదికూడా కొన్నిచోట్ల మాత్రమే.ఇప్పటివరకు అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసిందే లేదు. దీంతో జులై కూడా జూన్ లాగే లోటువర్షపాతంలో షాకిస్తుందా అన్న కంగారు ప్రజల్లో మరీముఖ్యంగా తెలుగు రైతుల్లో మొదలయ్యింది. అయితే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని… బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో కూడా అల్పపీడనం, ఆవర్తనం, ద్రోణి వంటివి ఏర్పడుతూ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకోనున్నాయని… తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు… ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమ్రంబీ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు బలమైన ఈదురుగాలులు తోడయి ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి… కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల సమయంలో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంటుంది… కాబట్టి ఈ జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు వర్ష సమయంలో చెట్లకింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండకూడదని… సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూడ్రోజులు (బుధ, గురు, శుక్రవారం) మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలకు ఉరుములు మెరుపులు, బలమైన ఈదురుగాలులు తోడవుతాయని హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని… తీరం వెంబడి ఈ గాలులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

ఎపిలోనూ ..

ఏపీ లో వర్షాల విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అలాగే ఏలూరు, ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు. ప్రకాశం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక మిగతాజిల్లాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

నిండుతున్న రిజర్వాయర్లు …

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేకున్నా ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ఈ నదులపైని జలాశయాలు నిండుకుండల్లా తలపిస్తున్నాయి… వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం దాదాపు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ప్లో కొనసాగుతోంది. దీంతో జలాశయం నిండిపోవడం నిన్న(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జలాశయం గేట్లను ఎత్తారు.. ఇలా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న శ్రీశైలం జలాశయంలోంచి నీటిని దిగువకు వదులుతున్నారు.

జూరాల ప్రాజెక్ట్‌కు కూడా భారీగా వరద చేరుతోంది…. దీంతో 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 1.26 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత 317.660 మీటర్లకు చేరుకుంది. అంటే ఇది పూర్తిగా నిండినట్లే.ఇక నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో సాగర్‌కు వరద ప్రవాహం మరింత పెరిగింది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 531.40 అడుగులుగా ఉంది. ఈ నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.

Leave a Reply