లబ్ధిదారులకు జాప్యం లేకుండా బిల్లును చెల్లిస్తాం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని నారాయణపేట జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి శంకర్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లిస్తుందని అన్నారు.
ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు పూర్తిచేస్తే సత్వరమే బిల్లులు చెల్లిస్తామని అన్నారు. నారాయణపేట జిల్లాలో 6036 ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా 5243 ఇళ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని 1461 ఇండ్లు పునాది వరకు నిర్మాణం చేపట్టారని 662 రూఫ్ లేవల్ పనులు చేపట్టగా, 1829 ఇండ్ల నిర్మాణం స్లాబులు వేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 130 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు గృహ ప్రవేశాలు చేపట్టినట్లు వెల్లడించారు. లబ్ధిదారులు జాప్యం చేయకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
