(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : మైనారిటీల సంక్షేమం అభివృద్ధి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ కేంద్రమంత్రి యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి తెలిపారు. ముస్లిం సోదరులకు అండగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురంలో సుజనా చౌదరి కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా సుజన చౌదరి మాట్లాడుతూ… పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనీ, ఎన్నికల్లో తనను ఎంతగానో ఆదరించి, అభిమానించి గెలిపించిన వారికి కచ్చితంగా ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. మళ్ళీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిమ్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావలసిన తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులు మెరుగు పరచడానికి అన్ని విధాలా ప్రణాళిక వేస్తున్నామన్న ఆయన ముఖ్యంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
