పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం…

గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్రంలో “బెస్ట్ అవైలబుల్ స్కీం” కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల (దళిత) పేద విద్యార్థులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం స్కీం కింద పాఠశాలలకు చెల్లించాల్సిన ఫీజులు బకాయిగా ఉండటంతో, యాజమాన్యాలు విద్యార్థులను తరగతులకు అనుమతించడం నిలిపివేశాయి. దీంతో పేద తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు MRPS నాయకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కలిసి హైవేపై రాస్తారో చేశారు. ఉదయం మూడు గంటలపాటు కలెక్టర్ కార్యాలయం ముఖద్వారాన్ని దిగ్బంధించి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపల్లి దశరథం మాట్లాడుతూ, “పిల్లల చదువులను అడ్డుకోవడం ప్రభుత్వ నిర్వాకానికి నిదర్శనం. వెంటనే బకాయిలు చెల్లించకపోతే మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది,” అని హెచ్చరించారు.

ఈ నిరసనలో MRPS నాయకులు కన్కం శంకర్, గంగారాం, విద్యార్థి సంఘాలు (SFI, AISF, PDSU, KVPS), అలాగే CPI పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

తల్లిదండ్రులు మాట్లాడుతూ, “మా పిల్లల చదువు ఆగిపోకూడదు. వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలి,” అని డిమాండ్ చేశారు.

Leave a Reply