Water Resources | భూగర్భ జలాల పెంపునకు చర్యలు..

Water Resources | భూగర్భ జలాల పెంపునకు చర్యలు..
- జిల్లాలో రూ.31.40 కోట్లతో వాటర్ షెడ్ల అభివృద్ధి..
- రూ.3.28 కోట్లతో ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ..
- పశువుల ఆరోగ్యం, పోషణకు అగ్ర తాంబూలం..
- ఆంధ్రప్రభతో డ్వామా పిడి అవసాని రవికుమార్..
Water Resources | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలను దీర్ఘకాలికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం జలవనరుల అభివృద్ధి ప్రధానమంత్రి (Prime Minister) కృషి యోజన రెండో దశ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లా నీటి నిర్వహణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అవసాని రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రభ బ్యూరోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈ పథకం కింద మొత్తం రూ.31.40 కోట్ల వ్యయంతో వాటర్ షెడ్ అభివృద్ధి పనులు చేపట్టామని, అదే విధంగా వ్యవసాయ, పశుసంవర్ధక పరికరాల పంపిణీకి రూ.3.28 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం రైతుల ఆదాయం పెంపుతో పాటు నీటి భద్రతకు పునాది వేస్తోందన్నారు.
ఇప్పటి వరకు అమలులో ఉన్న సమగ్ర జలవనరుల నిర్వహణ కార్యక్రమం స్థానంలో కొత్త తరం జలవనరుల అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చామని రవి కుమార్(Ravi Kumar) వివరించారు. ఈ పథకం 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితితో అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించామని చెప్పారు. మైదాన ప్రాంతాల్లో హెక్టారుకు రూ.22,000, కొండ, కరువు ప్రభావిత ప్రాంతాల్లో హెక్టారుకు రూ.28,000 చొప్పున యూనిట్ వ్యయాన్ని నిర్ణయించామని తెలిపారు. ఈ విధానం ద్వారా నీటి వనరుల అభివృద్ధితో పాటు నేల సారాన్ని పెంచే పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయని చెప్పారు.
Water Resources | క్లస్టర్‌ల వారీగా నిధుల కేటాయింపులు..
జిల్లాలోని వివిధ ప్రాంతాలను క్లస్టర్‌లుగా విభజించి నిధులు కేటాయించామని రవికుమార్ తెలిపారు. పులిచెర్ల (పీలేరు) క్లస్టర్ పరిధిలోని బొడిరెడ్డిగారిపల్లి, గనుగచింత, మంగళంపేట (Mangalampeta) గ్రామాల్లో రూ.1,327.99 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. పుంగనూరు క్లస్టర్‌లో గడ్డంవారిపల్లె, మంగళం ప్రాంతాల్లో రూ.835.81 లక్షలు, సదుం క్లస్టర్‌లో చెరుకువారిపల్లె, సోమల మండలాల్లో రూ.976.04 లక్షల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మొత్తం జిల్లాలో 38 సూక్ష్మ వాటర్ షెడ్లకు కలిపి రూ.3,139.84 లక్షలు కేటాయించి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Water Resources | నీటి సంరక్షణే భూగర్భ జలాలకు జీవం..
సహజ వనరుల నిర్వహణ పనులే.. ఈ పథకానికి వెన్నెముక అని రవికుమార్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో చిన్న నీటి కుంటలు 924, భూగర్భ జలాల పెంపుకు ఉపయోగపడే పర్కోలేషన్ ట్యాంకులు (Tank) 161, చెక్ డ్యామ్‌లు 83, అమృత్ సరోవర్లు 13 పూర్తయ్యాయని వివరించారు. ఈ సహజ వనరుల నిర్వహణ పనుల పై మొత్తం రూ.2,522.70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటి వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి, ఎండాకాలంలో కూడా రైతులకు నీటి లభ్యత మెరుగుపడుతోందన్నారు. అదే విధంగా ప్రవేశ స్థాయి పనుల కింద పశువైద్య శిబిరాలు, పశువుల నీటి తొట్లు, రచ్చబండల నిర్మాణం, సౌర వీధి దీపాల ఏర్పాటు వంటి 239 పనులు పూర్తి చేసి రూ.110.06 లక్షలు వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ పనుల ద్వారా గ్రామీణ జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతున్నాయని చెప్పారు.

Water Resources | రైతులకు ఆధునిక పరికరాలు..
రైతుల ఉత్పాదకత పెరగాలంటే.. ఆధునిక వ్యవసాయ పరికరాలు కీలకమని రవి కుమార్ పేర్కొన్నారు. ఉత్పాదక వ్యవస్థ మెరుగుదల కార్యక్రమం కింద భూమి సిద్ధం చేసుకునే దశ నుంచి పంట కోత వరకు అవసరమైన పరికరాలను రైతులకు (Farmer) పంపిణీ చేశామని తెలిపారు. 9 టైన్ కల్టివేటర్లు 121 మంది రైతులకు, 5 టైన్ కల్టివేటర్లు 60 మంది రైతులకు అందించామని చెప్పారు. అలాగే 11 టైన్ కల్టివేటర్లు, ఎంబీ నాగళ్లు, 5 బాటమ్ నాగళ్లు, 7 బాటమ్ నాగళ్లు పంపిణీ చేసినట్లు వివరించారు. మొక్కల రక్షణ కోసం తైవాన్ స్ప్రేయర్లు 204, బ్యాటరీ స్ప్రేయర్లు 152, ట్రాక్టర్‌కు అమర్చే స్ప్రేయర్లు 2 అందించామని తెలిపారు. పంట కోత అనంతరం నిల్వ కోసం తార్పాలిన్లు 1,135 మంది రైతులకు పంపిణీ చేశామని, సాగునీటి సరఫరా కోసం 3,184 మంది రైతులకు కలిపి 13,937 మీటర్ల హెచ్‌డీపీ ఈ పైపులు అందించామని చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా మొత్తం 4,933 మంది రైతులకు 15,686 పరికరాలను రూ.159.20 లక్షల ప్రభుత్వ వ్యయంతో పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Water Resources | పశుసంవర్ధకానికి భరోసా..
వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక రంగాన్ని కూడా లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ (Govt) లక్ష్యమని రవికుమార్ తెలిపారు. పశువులకు వ్యాధులు రాకుండా నివారించేందుకు 1,220 గాలికుంటు వ్యాధి టీకాలు వేశామని, పశువుల ఆరోగ్యం మెరుగుపడేందుకు 1,200 మంది రైతులకు ఖనిజ లవణాల మిశ్రమం అందించామని చెప్పారు. పశుగ్రాసం వృథా కాకుండా ఉండేందుకు 496 మంది రైతులకు గడ్డి కోసే యంత్రాలు, 156 మందికి పశువుల దాణా తొట్లు పంపిణీ చేశామని తెలిపారు. పాల దిగుబడిని శాస్త్రీయంగా సేకరించేందుకు 21 మంది రైతులకు పాలు దోయే యంత్రాలు అందించామని, ఉపాధి అవకాశాల పెంపు కోసం 10 మంది లబ్ధిదారులకు మేకలు లేదా గొర్రెల యూనిట్లు మంజూరు చేశామని వివరించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా మొత్తం 1,883 మంది లబ్ధిదారులకు రూ.168.85 లక్షల వ్యయంతో సహాయం అందించినట్లు చెప్పారు. మొత్తంగా నీటి సంరక్షణ, వ్యవసాయ పరికరాల పంపిణీ, పశుసంవర్ధక సహాయం అనే మూడు స్థంభాల పై ఈ పథకం నిలబడి ఉందని అవసాని రవికుమార్ స్పష్టం చేశారు. నీటిని కాపాడితేనే భవిష్యత్ తరాలకు సాగు భద్రంగా ఉంటుందని, రైతులు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అభివృద్ధికి భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

CLICK HERE TO READ డీకే ఆదికేశవులు కుమారుడు, కుమార్తె అరెస్ట్
